దేశంలో మాంసాహార ప్రియులకు తక్కువ ధరలో వచ్చే టేస్టీ ఫుడ్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు. మార్కెట్ లో మటన్ ధర పెరిగిపోవడంతో చాలా మంది చికెన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధర కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు కొడిగుడ్డు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురవుతుంది.. కొడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి వరకు డజను రూ.65 నుంచి రూ. 70 వరకు ఉండగా పది రోజుల్లోనే రూ.80 కి పెరిగిపోయింది. ఈ లేక్కన మొన్నటి వరకు 5 రూపాయలు ఉన్న కోడిగుడ్డు ధర ఇప్పుడు రూ.7 అయింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే చాన్సు ఉందని పౌల్ట్రీ నిర్వాహకులు అంటున్నారు.
ఇటీవల గుడ్ల ఉత్పత్తి గనణీయంగా తగ్గిపోవడంతో రేట్లు పెంచక తప్పడం లేదని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. అంతేకాదు గుడ్లు తింటే రోగ నిరోధక శక్తి ఎంతో పెరుగుతుందని.. వైద్యులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. పౌష్టికారంలో గుడ్డు ప్రాధానత్య ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా తర్వాత చాలా మంది రోగనిరోదక శక్తి కోసం ప్రతిరోజూ గుడ్డు తినడం అలవాటు చేసుకున్నారు. ఇక స్థానిక వినియోగంతో పాటు దానా ధరలు కూడా బాగా పెరిగిపోవడం తో కోడిగుడ్డు ధర పెంచాల్సి వస్తుందని నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం డిమాండ్ కి తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడం కూడా ధర పెరుగుదలకు కారణం అని నెక్ నిర్వాహకులు సంజీవ్ చింతావార్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ప్రతిరోజూ సుమారు 70 లక్షల కోడిగుడ్ల వినియోగం ఉంటుందని చింతవార్ తెలిపారు.
2020 లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దానా ఖర్చు రూ. 14 వరకు ఉండేది.. కానీ ఇప్పుడు రూ. 30 రూపాల వరకు ఉంటుందని అన్నారు. ఇటీవల దేశ వ్యాప్తంగా గుడ్ల వినియోగం బాగా పెరిగిపోయింది.. ఈ కారణంతోనే దేశంలో రూ.7 పెరిగింది. ఇటీవల కార్తీకమాసం కావడంతో గుడ్ల వినియోగం తక్కువగా ఉండటంతో రూ. 5 వరకు అమ్ముడు పోయింది.. కార్తీక మాసం పూర్తి కాగానే మళ్లీ గుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. దేశంలో ప్రతిరోజూ 25 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ రోజుకి ఐదు కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇదిలా ఉంటే.. కరోనా ప్రభావం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది కోళ్ల ఫారాలు పూర్తిగా మూశారు.
ఇక నాటు కోడిగుడ్డు ధరలు మరీ దారుణం.. రిటైల్ మార్కెట్ లో ఏకంగా రూ.10 నుంచి రూ.12 వరకు పలుకుతుంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్ లో ఒక్క గుడ్డు ధర రూ.7 వరకు ఉందని.. ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో త్వరలో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని రిటైల్ వ్యాపారస్తులు అంటున్నారు. ఇలానే పెరుక్కుంటూ పోతే త్వరలోనే కోడి గుడ్డు ధర రూ. 10 అయ్యే అవకాశం ఉందని వ్యాపారస్తులు అంటున్నారు. ఇప్పటికే మాంసం, చేపల ధరలు చుక్కలనంటుతున్నాయి. మార్కెట్ లో తక్కువ ధరలో దొరికే గుడ్డు కూడా చుక్కలు చూపించడంతో సామాన్యులు ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అని బాధపడుతున్నారు.