దేశంలో అప్పుడప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ), సెంట్రల్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోదాలు జరుపుతుంటాయి. రాష్ట్రాలలోని రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు, బిజినెస్ మ్యాన్ లను టార్గెట్ చేసుకుని ఈ దాడులు జరుగుతుంటాయి. మరి ఇలా పట్టుబడ్డ డబ్బంతా ఎక్కడికి పోతుంది.? ఆ నోట్ల కట్టలను ఏం చేస్తారు? అన్న అనుమానాలు అందరిలోనూ కలుగుతుంటాయి. మరి ఆ డబ్బును ఏం చేస్తారన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆర్థిక దర్యాప్తు సంస్థలకు సోదాలు జరిపి డబ్బును స్వాధీనం చేసుకునే అనుమతి ఉంటుంది. అయితే, వారు ఆ నగదును తమ వద్ద ఉంచుకునే అవకాశం లేదు.. ఉపయోగించడానికి వీలు లేదు. ప్రోటోకాల్ ప్రకారం.. నగదును రికవరీ చేసినప్పుడల్లా నిందితుడికి నగదు ఎక్కడ నుంచి వచ్చింది? అన్న వివరాలను తెలియజేయడానికి అవకాశం ఇస్తుంది. సదరు వ్యక్తులు ఆ డబ్బుకు సంబంధించి కచ్చితమైన సమాధానాలు, ఆధారాలు చూపితే పర్లేదు. అలా చూపని పక్షంలో ఆ డబ్బుని లెక్కల్లోకి రాని నగదుగా, అక్రమంగా సంపాదించిన డబ్బుగా పరిగణిస్తారు. ఇలా స్వాధీనం చేసుకున్న నగుదును తమతో పాటు సంబంధిత కార్యాలయాలకు తీసుకెళ్లి.. ఒక మెమోలో వాటి డినామినేషన్ల ఆధారంగా పొందుపరుస్తారు. అంటే.. 2000, 500, 100.. ఇలా డినామినేషన్ల వారిగా ఏ నోట్ల సంఖ్య ఎంత అన్నట్లుగా అందులో రాస్తారు.
ఆపై స్వతంత్ర సాక్షుల(ప్రభుత్వ అధికారులు) సమక్షంలో వాటిని బాక్సుల్లో పెట్టి సీలు వేస్తారు. డబ్బు సీలు చేసిన తర్వాత ఆ సీజ్ చేసిన డబ్బును, సంబంధించిన మెమోను.. ఆ రాష్ట్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖకు పంపిస్తారు. అక్కడ అది ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్‌కి చెందిన వ్యక్తిగత డిపాజిట్ (PD) ఖాతాలో జమ అవుతుంది. దీని ప్రకారం నగదు కేంద్ర ప్రభుత్వ ఖజానాలో జమ అవుతున్నట్టు లెక్క. ఆపై ఆయా సంస్థలు సీజ్ చేసిన నగదుకు సంబంధించిన తాత్కాలిక అటాచ్‌మెంట్ ఆర్డర్‌ను సిద్ధం చేస్తాయి. ఆరు నెలల్లో ఈ అటాచ్‌మెంట్‌ను నిర్ధారించడానికి న్యాయనిర్ణేత అధికారం అవసరం. తరువాత న్యాయ విచారణ సాగుతుంది. కేసులో విచారణ ముగిసే వరకు డబ్బు బ్యాంకులోనే ఉంచుతారు. నిందితుడు దోషిగా తేలితే ఆ నగదు మొత్తం కేంద్రానికి చెందిన ఆస్తిగా నిర్ణయిస్తారు. ఒకవేల నిందితుడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేస్తే ఆ డబ్బు తిరిగి అందజేస్తుంది.