ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించే వార్త ఇది. వచ్చే నెల నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్(డీఏ) పెంపుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం అధికంగా ఉండడంతో డీఏ పెంపుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది.
ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం.. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం డీఏను 3 శాతం పెంచడానికి ఆమోదించింది. తద్వారా 34 శాతానికి పెరిగింది. దీనివల్ల 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు మరో నాలుగు పెంపు అంటే.. 38 శాతానికి పెరగనుంది. దీంతోపాటు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిల చెల్లింపు సమస్యలను కేంద్రం పరిష్కరించనున్నట్లు తెలుస్తోంది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకేసారి రూ. 2 లక్షల పెండింగ్ బకాయిలను అందుకోనున్నారని.. కథనాలు వెలువడుతున్నాయి.
సాధారణంగా కేంద్రం సంవత్సరానికి రెండుసార్లు డీఏను సవరిస్తుంది. జనవరి, జులైలో దీనికి సంబంధించిన నిర్ణయాలు వెలువడతాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI)లో మార్పుల ఆధారంగా డీఏను సవరిస్తారు. దీనిబట్టి చూస్తే ఈసారి ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జూన్‌లో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది, ఇది ఆర్బీఐ కంఫర్ట్ లెవల్ అయిన 2 – 6 శాతం కంటే ఎక్కువగా ఉంది.
పెరగనున్న పీఎఫ్, గ్రాట్యుటీ, టీఏ
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలవారీ పీఎఫ్, గ్రాట్యుటీ అనేది బేసిక్ శాలరీ, డీఏపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు డీఏ పెరగుతుండడంతో పీఎఫ్, గ్రాట్యుటీలు పెరగనున్నాయి. గత ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏలో 17 శాతం పెరుగుదల వచ్చింది. 2021 జూన్ నుంచి ఇప్పటివరకూ డీఏ 17 శాతం నుంచి 34 శాతానికి చేరుకుంది. ఫలితంగా ఈపీఎఫ్, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతోంది. డీఏ ఎప్పుడైతే పెరుగుతుందో.. ఆ ప్రభావం టీఏపై పడుతుంది.
ఏఐసీపీఐ తాజా గణాంకాల ప్రకారం డీఏ 4 శాతం పెరగవచ్చని దాదాపుగా ఖరారైంది. జూన్ నెల గణాంకాల్లో ఇది కన్పిస్తోంది. ఇది కాకుండా ఏడాదిన్నర అంటే 18 నెలల నుంచి పెండింగులో ఉన్న డీఏ ఎరియర్‌పై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల పెండింగ్ డీఏ ఎరియర్స్ విషయంలో ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాలపై త్వరలోనే స్పష్టత రానుంది.
ఉదాహరణకు.. డీఏ 4 శాతం పెంపుతో ఉద్యోగి జీతం ఎంత పెరగొచ్చంటే..
ఉద్యోగి కనీస జీతం – రూ.18,000 నెలకు
ప్రస్తుత డీఏ 34 శాతం – రూ.6,120 నెలకు
కొత్త డీఏ 38 శాతం – రూ.6,840 నెలకు
పెరిగిన డీఏ – రూ.720 నెలకు
ఇది కూడా చదవండి: ఆ 14 వస్తువులను ఇలా కొంటే GST ఉండదు: నిర్మలా సీతారామన్
ఇది కూడా చదవండి: SBI WhatsApp Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. అకౌంట్ బ్యాలెన్స్, మినీ స్టేట్‌మెంట్.. అన్ని వాట్సాప్ లోనే..!