మంచిగా చదువుకోరా.. లేదంటే పెద్దయ్యాక గాడిదలు కాచుకోవడానికి కూడా పనికిరావు.. అంటూ పిల్లల్ని పెద్దలు హెచ్చరించడం ముమూలే. కానీ ఆ గాడిదలు పెంచుతూ లక్షల్లో ఆదాయం సంపాదించుకోవచ్చు అని నిరూపిస్తున్నారు ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. ఏకంగా 100కి పైగా గాడిదల్ని పోషిస్తూ.. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. వినూత్న ఆలోచనను సరైన ఆచరణలో పెడితే అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చు అనడానికి ఈ ముగ్గురే నిదర్శనం.
తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన పీవీవీ రమణ, కిరణ్ కుమార్, నవ్య ముగ్గురూ సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు చేశారు. ప్రస్తుతం రమణ, కిరణ్ ఇంకా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉండగా, నవ్య మాత్రం దిల్లీ ఐఐటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా వెళ్లినప్పుడు గమనించిన దానిని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకుని వీరు గాడిదల ఫారం వైపు అడుగులు వేశామని చెబుతున్నారు. “గాడిద పాలలో ఔషధ గుణాలు చాలా ఎక్కువ. విదేశాల్లో ఈ పాలకు డిమాండ్ కూడా చాలా ఎక్కువ. అక్కడే కాదు, మన దగ్గర కూడా గాడిద పాలకు గిరాకీ ఉందని తెలిసింది. అందుకే గాడిదలను పెంచాలని నిర్ణయించుకున్నాం. యూపీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి దేశవాళీ జాతులతో పాటుగా ఇథియోపియాకి చెందిన జాతి గాడిదలను తీసుకొచ్చాము. ఏడాదిగా ఫారం నడుస్తోంది. మరింత విస్తరించాలనే ఆలోచన చేస్తున్నాం” అని ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
ప్రస్తుతానికి వీరు రాజానగరం మండలం మల్లంపూడిలో 10 ఎకరాల పొలం లీజుకు తీసుకొని గాడిదల ఫాం నిర్వహిస్తున్నారు. దానికి అక్షయ డాంకీ ఫాం అని పేరు పెట్టారు. ఈ ఫాంలో గుజరాత్ కు చెందిన అలారీ, మహారాష్ట్రకు చెందిన కాట్వాడ్, ఆఫ్రికాకు చెందిన ఇథోపియాతోపాటు స్థానిక రకాలకు చెందిన 120 గాడిదలు పెంచుతున్నారు. ప్రస్తుతం లీటర్ రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకూ అమ్ముతున్నామని వారు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యూటీ టిప్స్ కోసం వినియోగించే కాస్మోటిక్స్ కంపెనీలకు ఎక్కువగా గాడిద పాలను విక్రయిస్తున్నట్టు తెలిపారు. అయితే.. ధర ఎక్కువగా ఉండడం, నిల్వ ఉంచడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎక్కువమంది కొనుగోలు చేయలేకపోతున్నారని చెప్తున్నారు. అందుకే పాలను ట్రెట్రా ప్యాక్‌లలో అందించాలని అనుకుంటున్నాం అని చెప్తున్నారు.