రియల్ ఎస్టేట్ రంగంలో డీఎల్ఎఫ్ కంపెనీ- కేపీ సింగ్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దాదాపు 5 దశాబ్దాల పాటు కంపెనీలో బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో భార్య మరణించిన తర్వాత ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. తర్వాత కంపెనీ బాధ్యతలు కుమారుడికి అప్పగించారు.
రియల్ ఎస్టేట్ రంగం అనగానే అందరికీ డీఎల్ఎఫ్, కేపీ సింగ్ గుర్తురాక మానరు. 1961లో ఆయన మామయ్య స్థాపించిన డీఎల్ఎఫ్ కంపెనీలో చేరిన కేపీ సింగ్.. 5 దశాబ్దాలపాటు వివిధ హోదాల్లో పనిచేశారు. 2020లో ఛైర్మన్ గా పదవీ విరణ కూడా చేశారు. ఆ తర్వాత నుంచి గౌరవ పదవిలో మాత్రమే కొనసాగుతున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియా ఛానల్ తో కేపీ సింగ్ ముచ్చటించారు. ఆ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచకున్నారు. 91 ఏళ్ల వయసులో తాను మళ్లీ ప్రేమలో పడినట్లు తన ప్రియురాలి గురించి చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వయసు పైబడే కొద్దీ భాగస్వామి ఎంత ముఖ్యం అనేది వివరించారు.
“నా భార్యే నాకు మిత్రురాలు. నాకు సంపూర్ణ మద్దతునిచ్చే ఫ్రెండ్ నా వైఫ్ మాత్రమే. ఆమెను కాపాడుకోవడం కోసం నేను చేయని ప్రయత్నం లేదు. 65 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఆమెను కోల్పోయిన తర్వాత మానసికంగా కుంగుబాటుకు గురయ్యాను. మీ మనసు, ఆలోచనా శక్తి కచ్చితంగా మునుపటిలా ఉండదు. మీరు అలాంటి సంఘటన తర్వాత కాస్త భిన్నంగా ఆలోచిస్తారు. 91 ఏళ్ల వయసులో మీ ప్రతిస్పందన నెమ్మదిస్తుంది. మీరు ఎఫెక్టివ్ గా నిర్ణయాలు తీసుకోలేరు. అందుకే భార్య మరణం తర్వాత కంపెనీ బాధ్యతల నుంచి వైదొలిగాను.
90 ఏళ్లు రాగానే ఓ లిస్టెడ్ కంపెనీ యాజమాన్యం నుంచి కచ్చితంగా వైదొలగాలి. నా కుమారుడికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చిందని నేను భావించాను. అందుకే నేను తప్పుకున్నాను. కేవలం గౌరవ పదవి మాత్రమే స్వీకరించాను. నా కుమారుడు నా కన్నా ప్రభావవంతంగా వ్యవహరిస్తున్నాడు. కంపెనీని వేగంగా అభివృద్ధి చేస్తున్నాడు. ఏ జంట అయినా తమ జీవన ప్రయాణంలో కలిసే ఉండాలని కోరుకుంటుంది. ఏ ఒక్కరూ ఒంటరిగా మిగలకూడదు. కానీ, నా విషయంలో అదే జరిగింది. నా భార్య దూరం అయ్యాక నేను ఒంటరినయ్యాను.
తాను మరణించడానికి కొన్ని రోజుల ముందు నా భార్య నాతో మాట్లాడింది. తనకోసం నేను శక్తివంచన లేకుండా ప్రయత్నించాని చెప్పింది. తాను వెళ్లిపోయినా కూడా నన్ను మాత్రం జీవితంలో నిరాశ పడకని చెప్పింది. ఆమె మరణం తర్వాత నేను దాదాపు రెండేళ్లు తీవ్రమైన ఒంటరితనంలో గడిపాను. ఆ తర్వాత నా జీవితంలోకి ఓ మనోహరమైన వ్యక్తి వచ్చింది. ఆమె పేరు షీనా.. ఎంతో చురుకైంది. నా జీవితంలో నేను కలిసిన అత్యుత్తమ- అద్భుతమైన వ్యక్తుల్లో షీనా ఒకరు. ఆమె హుషారుగా ఉండటమే కాదు.. నన్ను కూడా ఉత్సాహంగా ఉంచుతున్నారు. నేను ఎప్పుడు నిరాశకు గురైనా.. ఆమె నన్ను ఉత్తేజ పరుస్తుంది. ఇప్పుడు నేను ఈ విధంగా ఉత్సాహంగా ఉన్నాను అంటే అందుకు ఆమే కారణం” అంటూ డీఎల్ఎఫ్ అధినేత కేపీ సింగ్ వ్యాఖ్యానించారు.