మీరు సంపాదించే ఆదాయంపై మీరు ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అందుకు మీ ఆదాయాన్ని బట్టి ప్రభుత్వం కొన్ని శ్లాబులను ఏర్పాటుచేసింది. దానిని బట్టి మీ ఆదాయానికి తగిన శ్లాబును ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు కొన్ని పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. పొదుపు, పెట్టుబడులు, ఖర్చులు ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఆదాయపు పన్నుని లెక్కించి, మీ శ్లాబును నిర్ణయిస్తారు. అయితే చాలా మందికి ఈ లెక్కింపు విధానం అనేది అంత సులువు కాదు. తాము కట్టాల్సిన పన్నును ఎలా తగ్గించుకోవాలి? ఏ మినహాయింపులు పొందాలి? అనే విషయాలు చాలా మందికి తెలియవు.
2013లో ప్రభుత్వం కొన్ని ఆదాయపన్ను శ్లాబులను ప్రతిపాదించింది. ఆ తర్వాత 2020-21 బడ్జెట్ లో కొత్త ఆదాయపన్ను శ్లాబులను తీసుకొచ్చింది. అయితే ఈ విధానంలో ఎలాంటి మినహాయిలతో పని లేకుండా నేరుగా ఆదాయాన్ని బట్టి శ్లాబుల వారీగా పన్ను చెల్లించాల్సి ఉండేది. అయితే దీనిని డీఫాల్ట్ పన్ను చెల్లింపు విధానం అని చెబుతూనే.. మీకు కావాలంటే పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చే అవకాశాన్ని కల్పించారు. అయితే పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీలో రూ.లక్షన్నర, సెక్షన్ 80డీ కింద రూ.25 వేలు, హౌస్ లోన్ ఇంట్రస్ట్ రూ.2 లక్షలు, ఇంక ఎడ్యుకేషన్ లోన్ ఇంట్రస్ట్ వంటి వాటికి మినహాయింపులు ఉండటంతో ట్యాక్స్ పేయర్స్ అంతా పాత పన్ను విధానాన్నే ఎంచుకున్నారు.
ఈ సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారిలో కేవలం 1 శాతం మంది మాత్రమే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. ఆదాయపు పన్ను విధానాన్ని సరళీకృతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. శ్లాబులను సవరించడం, మినహాయింపుల పరిమితి మెంచడం, కొత్త కొత్త సెక్షన్లను తీసుకురావడం చేస్తున్నారు. అందులో భాగంగా 2023-24 బడ్జెట్ లో కొత్త శ్లాబులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ శ్లాబుల ప్రకారం 15 లక్షలు దాటి ఆదాయం కలిగిన వాళ్లు 30 శాతం పన్ను చెల్లించాలి. అలాగే ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 115బీఏసీ ప్రకారం రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.
రూ.7 లక్షలకు అదనంగా రూ.50 వేలు ప్రామాణిక తగ్గింపునూ వర్తింపజేశారు. అంటే రూ.7.5 లక్షల ఆదాయం వరకు ఉన్న వాళ్లు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదనమాట. అంటే మీ జీతం నెలకు రూ.62,500లోపే అయితే మీరు అసలు పన్ను గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే ఈ కొత్త పన్ను విధానం ప్రకటించిన తర్వాత చాలామందిలో ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్నలు మొదలయ్యాయి? సింపుల్ గా చెప్పాలి అంటే.. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో మీ ఆదాయం రూ.7,50,000 లోపే ఉంటే గనుక మీరు నిశ్చింతగా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోండి. ఈ విధానంలో మీరు ఎలాంటి మినహాయింపులు, పెట్టుబడి పెట్టినట్లు ఆధారాలు చూపాల్సిన అవసరం లేదు.
అలాగే మీ ఆదాయం రూ.10 లక్షలు అయితే.. మీకు 3 లక్షల వరకు మినహాయింపులు ఉండి ఉన్నట్లైతే పాత విధానంలో మీరు రూ.54,600 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే కొత్త పన్ను విధానం ప్రకారం చూసుకుంటే అక్కడ కూడా మీరు రూ.54,600 కట్టాల్సి వస్తుంది. మీ మొత్తం ఆదాయం అంటే జీతం, వడ్డీ, డివిడెండ్లు, అద్దే ఆలాంటి వాటన్నంటిని కలిపి వచ్చేదాన్ని స్థూల ఆదాయం అంటారు. వివిధ మినహాయింపులు పోను మిగిలిన ఆదాయానికి మాత్రమే పన్ను వర్తింపజేస్తారు. మీరు ఎంత పన్ను కట్టాలో చెక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ వాళ్లు వారి పోర్టల్ లో ఒక క్యాలుక్యులేటర్ ని కూడా అందుబాటులో ఉంచారు. అందులో మీరు స్పష్టంగా మీరు ఎంత పన్ను కట్టాల్సి వస్తుందో లెక్కించుకోవచ్చు.