వాతావరణ సమస్యలు కాకుండా, సాంకేతిక కారణాలని, ఇంకేవో కారణాలు చెప్పి విమానాలు రద్దు చేసే సందర్భాలు కోకొల్లలు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటారు. విమానయాన సంస్థలు ఇలా ఇష్టారీతిన విమానాలను రద్దు చేయటంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో డీజీసీఏ అప్రమత్తమైంది. దేశీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మరింత సమర్థవంతంగా, కచ్చితమైన సమయపాలనతో సేవలు అందించేలా కొత్త నిబంధనలు రూపొందించింది.
వీటి ప్రకారం.. విమానయాన సంస్థలు మీ వద్ద టికెట్ ఉండి బోర్డింగ్ సమయంలో ఫ్లైట్ ఎక్కించుకోకపోతే.. మీకు రూ.20 వేలు నష్ట పరిహారం అందనుంది. ఒకవేళ ఫ్లైట్ రద్దయితే పాసింజర్లకు సంబంధిత ఎయిర్లైన్స్ సంస్థలు రూ.10వేల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి ఉదంతాల్లో ఇప్పటి వరకూ రూ.4 వేలుగా ఉన్న పరిహారాన్ని అన్ని వర్గాలతో చర్చల అనంతరం భారీగా పెంచింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ రూల్స్ అమలవుతాయని సమాచారం.