భారత్ వ్యవసాయ ఆధారిత దేశం అని అందరికీ తెలిసిందే. టెక్నాలజీ, ఐటీ రంగాల్లో ఎంత దూసుకుపోతున్నా కూడా మనల్ని వ్యవసాయ ఆధారిత దేశంగానే చూస్తుంటారు. ఎందుకంటే మన దేశంలో ఎంతో మంది ఆదాయం కోసం వ్యవసాయం మీదే ఆధారపడుతున్నారు. అయితే వ్యవసాయం తర్వాత అత్యధిక మంది పాల ఉత్పత్తినే ఆదాయ వనరుగా ఎంచుకున్నారు. అలాగే పాడిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం మారుతున్న జీవన విధానం ఆధారంగా పాడి పరిశ్రమను వ్యాపారంగానూ, ఆదాయ వనరుగానూ చూస్తున్నారు. చాలా మంది డెయిరీ ఫామ్‌ని ఏర్పాటు చేసి ఉపాధి పొందడమే కాకుండా ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారు. అయితే చాలా మందికి ఈ డెయిరీ ఫామ్‌ని ఎలా ప్రారంభించాలి? ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాలు తెలియవు. అవేంటో.. ఇప్పుడు చూద్దాం.
పల్లెటూరుల్లో ఉండైవారికి ఇది తక్కువ ఖర్చుతో కూడున్న పని. ఎందుకంటే గ్రామాల్లో కావాల్సినంత పశుగ్రాసం దొరుకుతుంది. డెయిరీ ఏర్పాటు చేసుకునేందుకు సొంత స్థలం ఉంటుంది. ఒకవేళ లేకపోయినా లీజుకు తీసుకోవాలంటే పెద్దగా ఖర్చు కూడా కాదు. డెయిరీ ప్రారంభించే సమయంలో కాస్త ఎక్కువగానే ఖర్చు అవుతుంది. కానీ, ఆ పెట్టుబడిని చాలా త్వరగానే తిరిగి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదట డెయిరీ ఫామ్ పెట్టేందుకు అరెకరా పొలం ఉండాలి. దానిలో పశువులకు విశాలంగా ఉండేందుకు రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలి. తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టాలి అనుకుంటే మొదట 4 లేదా 5 గేదెలు/ఆవులతో ప్రారంభించుకోవచ్చు. ఆ తర్వాత మీరు నిదానంగా డెయిరీని పెంచుకుంటూ వెళ్లొచ్చు.
డెయిరీ పెట్టాలనుకుంటే మీకు ప్రభుత్వం నుంచి సాయం కూడా అందుతుంది. అయితే మీరు 10 లేదా అంతకన్నా ఎక్కువ పశువులతో ప్రారంభిస్తేనే ఆ లోన్ అనేది వర్తిస్తుంది. ప్రభుత్వం నుంచి 2.5 లక్షల రూపాయల లోన్ లభిస్తుంది. అంతేకాకుండా అందులో 25 శాతం సబ్సిడీగా పోతుంది. అదే మీరు రిజర్వడ్ కేటగిరీ అయితే మీకు ఏకంగా 33 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. ఆ మొత్తానికి కొంత సొంత డబ్బును జతచేసి ఎంచక్కా డెయిరీ ఫామ్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకరి వల్ల కాదు అనుకుంటే.. మిత్రులతో కలిసి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం కూడా మంచిదని చెబుతున్నారు. అయితే భాగస్వాములను మాత్రం నమ్మకస్తులను ఎంచుకోవాలని సూచిస్తుంటారు. భాగస్వాములు ఉంటే పనుల విషయంలోనూ బాగా అక్కరకు వస్తుంటారు.
అలాగే పశువుల డెయిరీకి ముఖ్యంగా కొన్ని విషయాలు తెలిసుండాలి. గేదెలు లేదా ఆవులకు సీజనల్ వ్యాధులు వస్తుంటాయి. కావును మీ ఊరిలోని పశువుల వైద్యుడితో టచ్‌లో ఉండాలి. ఎప్పటికప్పుడు వాటిని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అంతేకాకుండా పశువులకు మంచి గడ్డిని అందించాలి. అలాగే గడ్డితో పాటుగా దాణా కూడా పెట్టాలి. పచ్చి గడ్డిని అందించడం ద్వారా పాలు బాగా ఇస్తాయి. అలాగే ఎండు చెత్తని పెట్టడం వల్ల చిక్కని పాలను ఇస్తాయి. డెయిరీ ఫామ్ పెట్టుకోవాలంటే దాదాపు 3 నెలలకు సరిపడా గడ్డి, దాణా నిల్వలు ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు కాబట్టి సిద్ధంగా ఉండాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెయిరీ ఫామ్ మీద ఎంతో మంచి రాబడి వస్తుందని ఆర్ధిక నిపుణులు, వ్యాపార సలహాదారులు చెబుతుంటారు.