రేషన్ కార్డు ప్రయోజనాలు అందరకి తెలిసినవే. దారిద్య్ర రేఖ కన్నా తక్కువ వార్షిక ఆదాయం కలిగిన లబ్ధిదారుల రేషన్ కార్డుల ద్వారా తక్కువ ధరకే ఆహార ధాన్యాలు, బియ్యం, నిత్యవసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. కొన్ని ప్రభుత్వ పథకాలకు అర్హత పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే.. తక్కువ ఆదాయం కలిగిన వారికి బలమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. చాలామంది వీటిని నిరుపయోగం చేస్తున్నారు. ఈ క్రమంలో కేజ్రివాల్ సర్కార్ రేషన్ కార్డులకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏడాది లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉపయోగించని రేషన్ కార్డులను రద్దు చేసే దిశగా కసరత్తులు మొదలుపెట్టింది.
చాలా కాలంగా రేషన్ తీసుకోని వ్యక్తుల రేషన్ కార్డులను ఢిల్లీ సర్కార్ రద్దు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫల శాఖ.. జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికి వెళ్లి రేషన్ కార్డు వెరిఫికేషన్ చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని కోరింది. అనంతరం ఆయా రేషన్ కార్డులను రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అర్హులైన వారికి నాణ్యమైన రేషన్ ప్రయోజనాలు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ సర్కార్ చెబుతోంది. ఇప్పటిదాకా ఢిల్లీ ప్రభుత్వం 17.83 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు జారీ చేసింది.
2021 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు రేషన్ తీసుకోని వారిపై ఈ చర్యలు ఉండనున్నాయి. మరోవైపు రేషన్‌ను సద్వినియోగం చేసుకోని వారి సంఖ్య రెండు లక్షలకు పైగా ఉన్నట్లు అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఏడాది కాలంగా రేషన్ తీసుకోని లేదా ఒకట్రెండు సార్లు మాత్రమే రేషన్ తీసుకున్న వారి డేటాను సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది ఇంటింటికి వెళ్లి.. వెరిఫికేషన్ చేసి.. రేషన్ తీసుకోకపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. కారణం సరైనదని తేలితే పేరును జాబితాలో ఉంచుతారు. లేదంటే రద్దు చేయడం ఖాయం. ఇప్పటికే ఇంటింటి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.