ప్రపంచంలో అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ లో ఇండియన్ రైల్వేస్ మొదటి స్థానంలో ఉంది. రోజూ లక్షలాది మంది ప్రజలు రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. ఇతర రవాణాలతో పోలిస్తే.. రైలు ప్రయాణం చౌకగా, సౌకర్యవంతంగా ఉండడమే అందుకు కారణం. అయితే.. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అనుకోని కారణాలతో అప్పుడప్పుడు రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాలలో ప్రాణ నష్టం జరిగితే.. ఆ కుటుంబ సభ్యులకు జరిగే ఆర్థిక నష్టం ఎవరూ పూడ్చలేరు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ఒక వినూత్న బీమాను తీసుకొచ్చింది. ప్రమాదం జరిగినపుడు ప్రయాణికుడి స్థితిని బట్టి రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తారు.
ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతే బీమా కవరేజీ అప్లై అవుతుంది. ఆ విధంగానే భారతీయ రైల్వే కూడా ఐఆర్సీటీసీ రైలు ప్రయాణికులకు ఇలాంటి బీమానే తెచ్చింది. టికెట్ బుక్ చేసుకునే టైంలో ప్రయాణికులు ఓ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఈ బీమా గురించి పట్టించుకోరు. ఎందుకు జరుగుతుందిలే అన్నట్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. అలంటి వారు.. ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా కుటుంబానికి అండగా ఉండేది బీమానే అని గుర్తించుకోవాలి.
ఐఆర్సీటీసీ ‘ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ‘ పేరుతో రైల్లో ప్రయాణించేవారికి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కల్పిస్తోంది. 35 పైసలు చెల్లిస్తే చాలు 10 లక్షల రూపాయల వరకూ బీమాను పొందవచ్చు. అయితే.. రైల్లో ప్రయాణించే సమయంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలుసుకోవాలి. ప్రమాదంలో ప్రయాణికుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం పొందినా రూ.10 లక్షల బీమా పొందే అవకాశం ఉంటుంది. అదే పాక్షిక అంగవైకల్యానికి గురైతే రూ.7.50 లక్షల బీమా వర్తిస్తుంది. గాయాలపాలైతే చికిత్స కోసం ఆస్పత్రి ఖర్చులకు రూ.2 లక్షల బీమా వర్తిస్తుంది. అలాగే.. ప్రమాదంలో ప్రయాణికుడు మరణిస్తే.. మృతదేహ తరలింపు ఖర్చుల కింద రూ.10,000 అందిస్తారు.
దొంగతనం, దోపిడీ, ఉగ్రవాద దాడులు, అల్లర్లు, ప్రమాదవశాత్తూ ప్రయాణికుడు రైలు నుంచి పడిపోవడం, రైళ్లు పట్టాలు తప్పడం, ఢీకొనడం.. వంటి అన్ని సంధర్భాల్లో బీమా వర్తిస్తుంది.
దేశంలోని ఏ రైలులో ప్రయాణించేవారెవరైనా ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం పొందొచ్చు. అయితే.. ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్‌లో రిజర్వేషన్ చేసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. రైల్వేస్టేషన్ కౌంటర్‌లలో టికెట్ తీసుకున్న వారికి ఈ బీమా వర్తించదు. అలాగే.. విదేశీయులు(భారత్‌లో పనిచేస్తున్న లేదా పర్యటిస్తున్న విదేశీయులు), ఐదేళ్లలోపు పిల్లలు బీమా సదుపాయానికి అర్హులు కాదు.
టికెట్ బుక్ చేసే ముందు.. ఇన్సూరెన్స్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే కన్ఫర్మ్ అయిన వెంటనే మీ మొబైల్, ఇ-మెయిల్‌కు మెసేజ్ వస్తుంది. తర్వాత నామినీ వివరాలు నమోదు చేయడానికి ఓ లింక్‌ను కూడా పంపుతారు. ఒకసారి టికెట్ కన్ఫర్మ్ అయ్యాక క్యాన్సిల్ చేసుకోవడానికి వీలుండదు. ఒకే పీఎన్‌ఆర్ కింద బుక్ చేసుకునే అన్ని టికెట్స్ కు బీమా వర్తిస్తుంది. మరణం, అంగవైకల్యం, గాయాలు.. వీటికి మాత్రమే బీమా వర్తిస్తుంది. లగేజీ చోరీ, రైలు ఆలస్యం వల్ల సంభవించే నష్టం, రైలు ఆలస్యమైనప్పుడు అయ్యే నివాస, భోజన ఖర్చులకు బీమా వర్తించదు.
గమనిక: రైలు ప్రయాణం చేస్తున్న వారు టికెట్ బుక్ చేసుకునే ముందు ఇన్సూరెన్స్ కంపెనీ నిబంధనలు, షరతులను క్షుణ్నంగా తెలుసుకోవడం మంచిది.