పెరుగుతున్న ధరలతో.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు మంగళవారం కాస్త ఊరట లభించింది. ధర విషయంలో బంగారంతో పోటీ పడుతున్న గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. ఏకంగా 115 తగ్గి.. భారీ ఊరట కలిగింది. అయితే ఈ తగ్గింపు అనేది కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు మాత్రమే వర్తిస్తుంది. తాజాగా నేడు మంగళవారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఏకంగా రూ. 115 మేర దిగి వచ్చింది. ఐఓసీఎల్ ప్రకారం నవంబర్ 1 నుంచి 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటు ఢిల్లీలో రూ. 115 మేర తగ్గింది. కోల్‌కతాలో తగ్గింపు రూ. 113గా ఉండగా.. ముంబైలో ఈ తగ్గింపు రూ. 115.5గా నమోదు అయ్యింది. ఇక చెన్నైలో సిలిండర్ ధర తగ్గింపు రూ. 116.5గా ఉంది.
అయితే డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం స్థిరంగానే కొనసాగింది. తాజాగా నవంబర్ 1న కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. డొమెస్టిక్ సిలిండర్ రేటు స్థిరంగానే ఉంది. కమర్షియల్ సిలిండర్ రేటు మాత్రం భారీగా తగ్గింది. సాధారణంగా గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెలా ఆరంభంలో అనగా.. నెల ప్రారంభం 1వ తేదీ నుంచి మారుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రేటును తగ్గించేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్యాస్ రేట్లు, రూపాయి మారకం విలువ వంటి పలు అంశాలు గ్యాస్ ధరలను ప్రభావితం చేస్తాయి.