ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం బాగా పెరుగుతోంది. దీంతో మొబైల్ తయారీతో సంబంధంలేని కంపెనీలు కూడా ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ ఉత్పత్తి సంస్థ కోకాకోలా కూడా ఈ రంగంలోకి అడుగుపెట్టబోతోందట. త్వరలో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లో కోకాకోలా పరిచయం చేయనుందని సమాచారం. ఈ వివరాలను పాపులర్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ట్వీట్ చేశారు. కోలా ఫోన్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్ కోసం ఓ మొబైల్ తయారీ కంపెనీతో కోకాకోలా జట్టు కట్టిందని చెబుతూ ట్వీట్ చేశారు. సంబంధింత ఫోన్ మోడల్ ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ ఏడాది మార్చి నెలాఖరున కోలా ఫోన్‌ను భారతీయ విపణిలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌లో వెనుక వైపు రెండు కెమెరాలు ఇస్తున్నట్లు ఫొటోల ద్వారా తెలుస్తోంది. ఫోన్ సైడ్‌లో వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఉన్నాయి. కోలా ఫోన్ వెనుక వైపు చూసేందుకు రియల్ మీ ఫోన్లను పోలి ఉండటంతో.. రియల్ మీ సంస్థతో కోకాకోలా జట్టు కట్టిందని అంటున్నారు. దీని మీద కోకాకోలా గానీ, రియల్ మీ గానీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. కానీ, ఫీచర్ల పరంగా చూసుకుంటే.. రియల్ మీ 10 సిరీస్ ఫోన్ మాదిరిగానే కోకాకోల్ కొత్త ఫోన్ ఉందని చెబుతున్నారు.
ఈ ఫోన్‌ను బ్రాండ్ ప్రమోషన్ కోసమే కోకాకోలా తీసుకొస్తోందా? లేదా స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి ఆ కంపెనీ అడుగుపెట్టనుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఇకపోతే, మొబైల్ తయారీతో సంబంధంలేని పలు వ్యాపార సంస్థలు ఫోన్ల తయారీపై ఆసక్తి కనబర్చడం గతంలోనూ జరిగింది. ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెప్సీ 2015లో ఓ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. పెప్సీ 1 పేరుతో షెన్ జెన్ కూబే అనే కంపెనీతో కలసి పెప్సీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. కానీ ఈ ఫోన్ ప్రొడక్షన్‌ను అనూహ్యంగా నిలిపివేసింది. ఆ తర్వాత వన్ ప్లస్, ఒప్పో సంస్థలతో కలసి మెక్ లారెన్, అవెంజర్స్ ఎడిషన్స్ పేర్లతో పలు ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కాగా, అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం టెస్లా కూడా ‘పై ఫోన్’ పేరుతో ఒక గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో తీసుకురానుండటం గమనార్హం. మరి, కోకాకోలా కొత్త ఫోన్‌ను తీసుకురానుండటం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.