దేశంలో ప్రస్తుతం పప్పు దినుసుల కొరత ఉంది. కందిపప్పు ధరలు మరింత పెరిగే అవకాశం కనబడుతుందని అంటున్నారు.
పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న సామాన్యులకు ఇప్పుడు కందిపప్పు భారంగా మారనుంది. డిమాండ్ కి తగ్గా కందిపప్పు అందుబాటులో లేకపోవడంతో దేశవ్యాప్తంగా కొరత అనేది ఏర్పడింది. సూపర్ మార్కెట్లు సహా కిరాణా దుకాణాల్లో నోస్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రిటైల్ మార్కెట్లో రూ. 140 వద్ద ఉన్న కిలో కందిపప్పు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. వోల్ సేల్ మార్కెట్లో రెండు నెలల క్రితం వరకూ రూ. 100 నుంచి రూ. 103 ఉన్న కందిపప్పు ఇప్పుడు రిటైల్ మార్కెట్లో రూ. 140 వరకూ పలుకుతోంది. ఏప్రిల్ 3న కిలో కందిపప్పు రూ. 120 నుంచి రూ. 130కి పెరిగింది.
మినపగుళ్ళు కూడా రూ. 130 నుంచి రూ. 140కి పెరిగింది. ఈ రెండు నెలల్లో వ్యాపారులు కిలో మీద అదనంగా రూ. 10 పెంచారు. పప్పుల కొరత కారణంగా ధరల మీద ప్రభావం కనబడుతుంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పప్పుల దిగుబడి గణనీయంగా తగ్గింది. యాసంగి కందులను ఫిబ్రవరి నెల నుంచే వ్యవసాయ మార్కెట్లకు విక్రయించడానికి రైతులు తీసుకొస్తారు. కానీ కందులు, పెసలు, మినుముల దిగుబడి తగ్గడంతో మార్కెట్ కి పంట సరిగా చేరడం లేదు. గత ఏడాది దేశంలో 43.4 లక్షల టన్నుల పప్పుధాన్యాలు దిగుబడి ఇవ్వగా.. అదనంగా 15 లక్షల టన్నులను దిగుమతి చేసుకుంది ప్రభుత్వం.
ఈ ఏడాది మరీ ఘోరంగా 38.9 లక్షల టన్నుల లోపే దిగుబడి ఆగిపోయింది. పప్పుల కొరతకు అకాల వర్షాలు కూడా ఒక కారణమని చెబుతున్నారు. గత జూలై నుంచి డిసెంబర్ వరకూ భారీ వర్షాల కారణంగా దేశంలో పప్పు ధాన్యాల దిగుబడి తగ్గింది. ఒక్క డిసెంబర్ నెలలోనే 2 లక్షల టన్నుల పప్పు దినుసులు దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న కొరత నేపథ్యంలో 12 లక్షల టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కొరత కారణంగా రూ. 140 ఉన్న కందిపప్పు రూ. 180కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే సామాన్యుడి నెత్తిన మరో భారం పడినట్టే అవుతుంది.