బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేని పరిస్థితి. ఇంకా ధర పెరిగిపోతుందేమో అన్న భయంతో ఇప్పుడు ధర ఎక్కువున్నా సరే కొనేస్తుంటారు. తీరా కొన్న కొన్ని రోజులకే ఊహించని రీతిలో బంగారం ధర తగ్గిపోతుంది. అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు బంగారం కొనాలో, లేదో అన్న అయోమయంలో ఉంటారు. అయితే ఇప్పుడు 61 వేలు పైన ఉన్న బంగారం రూ. 50 వేలకు పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవాళ ఉన్న బంగారం ధర రేపు ఉండదు. ఓ నాలుగు రోజులు తన ప్రతాపం చూపించి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాలుగు రోజులు ఏవిటో పసిడి ప్రియుల మీద జాలి వేసి తగ్గుతుంది. ఇక ఇదే కథ సైకిల్ చక్రంలా తిరుగుతుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల వద్ద రూ. 61,030 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం అయితే రూ. 55,940 పలుకుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు చూస్తే తగ్గడంలో స్లిమ్ నెస్ ని, పెరగడంలో ఊబకాయాన్ని ప్రదర్శిస్తున్నాయి. అక్షయ తృతీయ నాటికి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నెల 22న అక్షయ తృతీయ పర్వదినం కారణంగా బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు.
ఈ డిమాండ్ కారణంగా బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరోవైపు అంతర్జాతీయంగా కూడా బంగారం ధర పెరుగుతూ వస్తుంది. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 61 వేలు దాటేసింది. ఇటు రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరుగుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న బంగారం ధరలు దిగొస్తాయని నిపుణులు అంటున్నారు. రూ. 50 వేలకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను గమనిస్తే పసిడి ధరలు దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి.
ఈ సమస్య నుంచి కోలుకునేందుకు అమెరికా, జర్మనీ, ఇటలీ, చైనా, జపాన్, రష్యా దేశాలు తమ వద్ద నున్న బంగారం నిల్వల నుంచి కొంత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2007లో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే గ్రీస్, సైప్రస్ దేశాలు పెద్ద ఎత్తున బంగారం నిల్వలను బయటకు తీసి రిటైల్ మార్కెట్లో విక్రయించాయి. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయని, ఏ క్షణాన అయినా బంగారం ధర పతనమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అదే నిజమైతే గనుక రూ. 50 వేలకు బంగారం ధర పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.