దేశవ్యాప్తంగా ఎంతో మంది రైతులు సంప్రదాయ వ్యవసాయంపైనే ఆధారపడకుండా.. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఆదాయ వనరులను పెంచుకుంటున్నారు. అలాంటి ఆలోచన ఉన్నవారికి ‘ముత్యాల సాగు..‘ మంచి ఐడియా అని చెప్పొచ్చు. తక్కువ స్థలంలో.. తక్కువ ఖర్చుతో లక్షల రూపాయల లాభం పొందే వ్యాపారం ఇది. సహజంగా ముత్యాలు ఏర్పడడం అరుదుగా జరుగుతుంటుంది. అందుకే, నత్తగుల్లలు లేదా మసెల్స్ (నల్ల నత్తలు) పెంచి వాటి ఆల్చిప్పల నుంచి ముత్యాలు తయారుచేస్తున్నారు. ఆల్చిప్ప/ముత్యపుచిప్ప లోపలి పోరల్లో జరిగే రసాయన చర్యల వలన ముత్యం ఏర్పడుతుంది. రైతులు తమ పొలం లేదా ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి విస్తీర్ణంలో ముత్యాలను పండించవచ్చు.
రాజస్థాన్ లోని అజ్మేర్ కు చెందిన రజా మహ్మద్ అనే ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయుడు.. ఆ ప్రయత్నమే చేశాడు. కరోనా వల్ల ఉన్న ఉపాధి కోల్పోవడంతో.. ముత్యాల సాగు వైపు ద్రుష్టి సారించాడు. మొదట పావు ఎకరం స్థలంలో చిన్న కుంట తీయించాడు. దేశంలో పలు ప్రాంతాల నుంచి ఆలుచిప్పలను తెప్పించుకున్నాడు. ఈ ముత్యాల సాగుకు దాదాపు 15 నెలల నుంచి 20 నెలల సమయం పడుతుంది. ఈ ముత్యాల సాగులో ఒక్కోసారి ఆలుచిప్పలు పాడవుతుంటాయి. అయినప్పటికీ.. మంచి ముత్యాలు చేతికి అందితే మాత్రం లాభాల పంట పండుతుంది. అలా రజా మహ్మద్ ముత్యాల సాగులో నిపుణుడు అయిపోయాడు. ప్రస్తుతం తనకున్న చిన్న కుంటతోనే రజా మహ్మద్ ఒక బ్యాచ్ కు దాదాపు రూ.2 నుంచి 3 లక్షలు సంపాదిస్తున్నాడు. ముత్యాల పెంపకంపై ప్రభుత్వం శిక్షణ కూడా ఇస్తుంది. అంతేకాదు.. రుణ సదుపాయం కూడా ఉంది. ముత్యాల పెంపకం గురించి మరింత సమాచారం కింది వీడియోలో చూద్దాం..