బిల్డర్ లేదా కాంట్రాక్టర్ కట్టిన ఇల్లు కొనుక్కోవడం మంచిదా? లేక మనమే దగ్గరుండి ఇల్లు కట్టించుకోవడం మంచిదా?
హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాదు ఇప్పుడు పల్లెటూర్లు, పట్టణాల్లో కూడా బిల్డర్లు వచ్చేశారు. వాళ్లనే కాంట్రాక్టర్లు అని కూడా అంటారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అంటే స్థలం కొని ఇల్లు కట్టుకోవాలనుకుంటే సామర్థ్యం సరిపోదు. అందుకే చాలా మంది బిల్డర్లు కట్టేసిన ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు. ఊర్లలో కూడా ఇలా కట్టేసిన ఇండ్లను అమ్ముతున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులతో దగ్గరుండి ఇల్లు కట్టించుకుంటుంటే.. కొంతమంది మాత్రం ఆల్రెడీ కట్టేసిన ఇల్లు కొనుక్కుంటున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం చేస్తూ.. సొంత ఊర్లలో దగ్గరుండి ఇల్లు కట్టుకునే తీరిక లేక కట్టేసిన ఇల్లు కొనుక్కుంటున్నారు. మరి కట్టేసిన ఇండ్లను కొనుక్కోవడం మంచిదా? లేక ఎవరికి వారు దగ్గరుండి కొనుక్కోవడం మంచిదా?
కొంతమంది డబ్బున్న వాళ్ళు ఒకేసారి ఐదారు ఇళ్ళకు సరిపడా స్థలాలు కొనేసి.. ఒక మేస్త్రీతో మాట్లాడుకుని నిర్మాణ పనులు మొదలు పెట్టేస్తున్నారు. కొంతమంది అయితే మిస్త్రీతో భాగస్వామ్యం కుదుర్చుకుని నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఒకేసారి ఐదారు ఇళ్ళు నిర్మాణం వల్ల ఖర్చు అనేది తగ్గుతుంది. పైగా సగం నిర్మాణంలో ఉండగానే కొనేవారు అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారు. అయితే దీని వల్ల నిర్మాణంలో నాణ్యత అనేది ఉండకపోవచ్చు. ఎంత తక్కువలో చేస్తే అంత మిగులుతుందన్న ఆశతో అటు ఓనర్లు, ఇటు కాంట్రాక్టర్లు ఇద్దరూ కూడా నాణ్యత లేని మెటీరియల్ వాడి ఇండ్లను నిర్మించే అవకాశం ఉంది. అలా అని తక్కువ ధరకు అమ్ముతారా అంటే అబ్బే ఎక్కువ ధరకే అమ్ముతారు.
తక్కువ ధరకు అమ్మితే మాత్రం నాణ్యత లేని ఇంటిని ఎవరు కొనుగోలు చేస్తారు చెప్పండి. అందుకే ఎవరో కట్టేసిన ఇంటిని కొనుక్కోవడం కంటే సొంతంగా దగ్గరుండి మనమే కట్టుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో సొంత ఇంటి నిర్మాణం అనేది జరిగితే నాణ్యత ఉంటుందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇల్లు అనేది ఎంతోమంది కల. ఆ కలను నిజం చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తారు. పుట్టిన ఊర్లో సొంత ఇల్లు ఉంటే ఆ కిక్కే వేరు అని ఆలోచిస్తారు. అయితే వీరి బలహీనతను కొంతమంది క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.