హైదరాబాద్ లో స్థలం కొనుక్కుని మనకి నచ్చినట్టు ఇల్లు కట్టుకుంటే ఆ కిక్కే వేరు కదా. కానీ స్థలం కొందామంటే అందని ద్రాక్ష అయిపోయిందే అని బాధపడకండి. ఇలా చేస్తే స్థలం కొనుక్కుని తక్కువ బడ్జెట్ లో సొంత ఇంటి కలను నిజం చేసుకోవచ్చు.
స్థలం ఉండి ఇల్లు కట్టాలంటే తక్కువలో తక్కువ రూ. 20 లక్షలు ఖర్చవుతుంది. ఇక హైదరాబాద్ లాంటి సిటీలో స్థలం కొనాలంటే చదరపు అడుగుకి రూ. 4 వేలు, రూ. 5 వేలు, రూ. 10 వేలు, రూ. 30 వేలు ఇలా ఉన్నాయి ధరలు. సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే నెరవేరని కల. అయితే ఈ ఒక్క ఆలోచనతో మీరు తక్కువ బడ్జెట్ లోనే సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. మీ బడ్జెట్ రూ. 30 లక్షలు అనుకుంటే 100 గజాల్లో 2 బీహెచ్‌కే ఇల్లు కట్టుకోవచ్చు. ఒక రూ. 40 లక్షలు పెట్టుకుంటే 200 గజాల్లో విశాలంగా కట్టుకోవచ్చు. హైదరాబాద్ లో అభివృద్ధి అనేది ఇతర శివారు ప్రాంతాలకు కూడా విస్తరిస్తోంది. ఓ 30 కి.మీ. దూరం ఉన్నా కూడా శివారు ప్రాంతాల్లో విల్లాలు, ఫ్లాట్లు కొనుక్కుంటున్నారు.
రోడ్ కనెక్టివిటీ కూడా బాగుండడంతో రోజూ అక్కడి నుంచే ఆఫీసులకు వస్తున్నారు. ట్రాఫిక్ వల్ల 20, 30 కి.మీ. ప్రయాణం కూడా వేరే గ్రహం మీదకు వెళ్తున్నట్టు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ దూరం పెద్ద దూరమే కాదు. కానీ సిటీ కదా ఆ మాత్రం ఉంటుంది. అయితే ఈ మాత్రం ప్రయాణం కూడా చేయకపోతే లైఫ్ లో సొంతింటి కల అనేది ఎప్పటికీ సొంతం కాదు. ఉదాహరణకు పటాన్ చెరువు తీసుకుందాం. కెమికల్ అండ్ ఫార్మా కంపెనీలు కలిగిన పారిశ్రామిక కేంద్రంగా ఈ ఏరియా అభివృద్ధి చెందింది. మియాపూర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ వంటి ఐటీ సెక్టార్ ఏరియాలకు కనెక్టివిటీ అనేది మెరుగవ్వడం వల్ల ఇక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల సంఖ్య పెరిగింది.
పటాన్ చెరువు నుంచి హైదరాబాద్ సిటీలోకి రావాలంటే 30 కి.మీ. ప్రయాణించాల్సి ఉంటుంది. పటాన్ చెరువు నుంచి హైదరాబాద్ సిటీలోకి వచ్చే ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్ పల్లి వంటి ఏరియాలు 20 కి.మీ. ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ ఏరియాలో ఖాళీ స్థలం కొనాలంటే సగటున చదరపు అడుగు రూ. 3,100 పడుతుంది. 2 బీహెచ్‌కే కట్టుకోవాలంటే కనీసం 1000 చదరపు అడుగుల స్థలం ఉండాలి. 1000 చదరపు అడుగులకు రూ. 31 లక్షలు అవుతుంది. స్థలానికే రూ. 30 లక్షలు అయిపోతే ఇక ఇల్లు ఎలా కట్టుకోగలము అని అనుకోకండి. స్థలానికి రూ. 30 లక్షలు పెట్టుబడి ఎందుకు పెట్టడం? మీతో పాటు భాగస్వాములుగా ఇంకో ముగ్గురిని చూసుకోండి. అప్పుడు 100 గజాల ఖాళీ స్థలం మీకు రూ. ఏడున్నర లక్షలకే వస్తుంది.
స్థలం అయిపోయింది. ఇక ఇల్లు కట్టాలి. మనిషి ఒక రూ. 20 లక్షలు వేసుకుంటే బ్రహ్మాండమైన ఇల్లు పూర్తవుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఖాళీగా వదిలేసి.. నాలుగు అంతస్తులు కట్టచ్చు. అప్పుడు ఒక మనిషికి ఇల్లు కట్టడానికి అయిన ఖర్చు రూ. 27 లక్షలు. మీరు ఖర్చు తగ్గించుకుంటే రూ. 25 లక్షల్లో అయిపోతుంది. లేదు రాజీ పడకూడదు అనుకుంటే కనుక రూ. 30 లక్షలు అవుతుంది. సొంత ఇల్లు, ఇండివిడ్యువల్ హౌజ్, పక్కన వేరే ఫ్లాట్ వారు ఉండరు. చాలా ప్రశాంతంగా జీవించవచ్చు. 100 గజాల్లో ఇల్లు సరిపోదు, 200 గజాలు కావాలి అనుకుంటే కనుక రూ. 38 లక్షలు అవుతుంది.
ఇదే ధరలో ఫ్లాట్స్ కూడా వస్తాయి. కానీ కట్టించుకున్న ఇల్లు అంటే ఆ నమ్మకం వేరే ఉంటుంది కదా. ఈ సొంతింటి కల నెరవేరాలంటే మీరు ఇంకో ముగ్గురు స్నేహితులు లేదా బంధువులతో కలిసి కొనాల్సి ఉంటుంది. ల్యాండ్ మీ నలుగురి మీద రిజిస్టర్ అయి ఉంటుంది. ఎవరైనా అమ్మేస్తాను అంటే మీలో ఎవరో ఒకరు కొనుక్కోవచ్చు. లేదా అందరూ సొంత ఊరు వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అమ్మేసుకోవచ్చు. పటాన్ చెరువు లాంటి అభివృద్ధి చెందుతున్న ఏరియాల్లో ఈ విధంగా చేస్తే లాభాలు ఉంటాయి.