నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తినే ఆహారంలో చేప కూడా ఒకటి. కావాల్సినన్ని పోషకాలతో పాటు.., రుచిలో కూడా చేప సూపర్ ఉంటుంది. కానీ.., చేప రకాన్ని బట్టి దాని టేస్ట్ మారుతుంటుంది. మన దగ్గర పులస చేపకి మంచి గిరాకీ ఉంటుంది. పులస ఒక్కో కేజీ 10 వేల రూపాయలు కూడా దాటిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ.., మీకు తెలుసా? ఓ రకం చేప మత్స్యకారులకు ఇప్పుడు లక్షలు కురిపిస్తోందని? అదే కొమ్ము కోనెం చేప.
సాధారణ చేపల కన్నా 10 ఇంతలు మించి పెరుగుతుంది ఇది. ఇంత భారీ సైజ్ లో ఉంటుంది కాబట్టి కొమ్ము కోనెం చేప చిక్కడం అంత సులభం కాదు. సముద్రంలో వందల కిలో మీటర్ల లోతులోకి వల వేసి.., మూడు నాలుగు రోజులు ఓపికగా ఎదురుచూస్తే ఈ చేప వలకి చిక్కే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే.. కొమ్ము కోనెం చేపలు వలలో పడితే ఒకటి, రెండు పడవు. పడితే 20 నుండి 30 చేపలు ఒకేసారి వలకి చిక్కుతాయి. వీటిలో ఒక్కో చేప బరువు 40 నుండి 50 కేజీల వరకు ఉంటుంది. కొన్ని చేపలు అసాధారణంగా పెరిగి 80 కేజీల వరకు కూడా ఉంటాయి. ఈ బరువుని సాధారణ వలలు ఆపలేవు. వీటి కోసం మత్స్యకారుల వద్ద ప్రత్యేక వలలు ఉంటాయి.
ఈ చేపలు చిక్కితే గుంపుగా చిక్కడం వల్ల.. కేజీల లెక్క అమ్మినా మత్స్యకారులకి లక్షల్లో గిట్టుబాటు అవుతోంది. మార్కెట్ లో ఈ చేప ఖరీదు కేజీ 800 వరకు ఉంది. ఇక మన దగ్గర కన్నా.., విదేశాల్లో ఈ చేపకి మంచి గిరాకీ ఉంటుంది. ఎక్కువగా శ్రీలంక దేశీయులు ఈ చేపని ఇష్టపడతారట. అందుకే అక్కడికే ఎక్కువగా ఎగుమతులు జరుగుతుంటాయి. ఇక మత్స్యకారుల నుంచీ ఎక్స్ పోర్ట్ కంపెనీలకు విక్రయం జరిగిన తర్వాత ఈ చేప ధర కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఈ కొమ్ము కోనెం చేపలు విశాఖ తీరాన నివశించే మత్స్యకారులకు ఎక్కువగా దొరుకుతుండటం విశేషం.