ఈ-కామర్స్ సైట్స్ ‘ఫ్లిప్‌కార్ట్‘ అందరకీ సుపరిచితమే.ఇందులో ఆర్డర్లు చేయడం మనందరికీ అలవాటే. అందరికీ, ఆర్డర్ చేసిన వస్తువే చేతికొచ్చినా, అడపాదడపా కొన్ని చేదు అనుభవాలూ ఎదురవుతుంటాయి. ఒక వస్తువు కోసం డబ్బు చెల్లిస్తే మరొక వస్తువు రావడం, లేదా ఏ వస్తువూ రాకపోవడం లాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అలాంటి అనుభవమే ఓ యువతికి ఎదురైంది. డబ్బులు చెల్లించి ఫోన్ ఆర్డర్ చేస్తే.. ఫ్లిప్‌కార్ట్ సంస్థ దానిని డెలివరీ చేయకుండా దోబూచలాడింది. దీంతో యువతి సదరు సంస్థను కోర్టుకు ఈడ్చి విజయం సాధించింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరు, రాజాజీనగర్‌కు చెందిన దివ్యశ్రీ గతేడాది జనవరి 15న ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ. 12,499 విలువైన ఒక మొబైల్ కొనుగోలు చేసింది. క్రెడిట్ కార్డ్ ద్వారా వాయిదాల పద్ధతిలో చెల్లింపు చేసే ఆప్షన్‌ను ఆమె ఎంచుకుంది. పేమెంట్ ప్రాసెస్ మొత్తం విజయవంతంగా పూర్తయింది. ఆమె క్రెడిట్ కార్డ్ ద్వారా సంబంధిత అమౌంట్ మొత్తం ఫ్రీజ్ అయింది. అంటే..సదరు క్రెడిట్ కార్డ్ కంపెనీ ఆ డబ్బును ఆమె తరపున ఫ్లిప్‌కార్ట్ సంస్థకు చెల్లించింది. ఇదంతా కంప్లీట్ అయ్యాక రెండు దినములలో ఫోన్ డెలివరీ అవుతుందని దివ్యశ్రీకి ఫ్లిప్‌కార్ట్ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. అయితే.. రెండు రోజులు కాదు కదా, నెల రోజులు ఎదురు చూసినా ఆమెకు ఫోన్ అందలేదు. ఈ విషయం గురుంచి ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసినా.. అటువైపు నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు.
పైగా ఆర్డర్ చేసిన మొబైల్ ఫోన్ అందకపోగా, క్రెడిట్ కార్డ్ కంపెనీకి నెల వారీ EMIలు చెల్లించాల్సి వచ్చింది. దీంతోవిసుగు చెందిన ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బెంగళూరు అర్బన్ జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ లో యువతి పిటిషన్ వేయగా, కోర్టు విచారణ చేపట్టింది. దీనికి సంబంధించి కోర్టు ఫ్లిఫ్‌కార్ట్ కంపెనీకి నోటీసులు కూడా పంపింది. అయినా సదరు సంస్థ నుంచి ఏ స్పందన లేదు. దీంతో విచారణ పూర్తి చేసిన కోర్టు ఈ-కామర్స్ కంపెనీకి భారీ జరిమానా విధించింది. సేవల విషయంలో ఫ్లిప్‌కార్ట్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, అనైతిక పద్ధతులను కూడా అనుసరించిందని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సకాలంలో ఫోన్ ఇవ్వకపోవడంతో వినియోగదారు ఆర్థికంగా నష్టపోయారని, ‘మానసికంగా బాధ పడ్డారని’ వెల్లడించింది.
మొబైల్ ఫోన్ కోసం ఈ-కామర్స్ కంపెనీకి దివ్యశ్రీ చెల్లించిన రూ. 12,499తో పాటు, ఆ మొత్తం మీద 12 శాతం వార్షిక వడ్డీని కూడా కలిపి చెల్లించాలని కమిషన్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు కోర్టు ఖర్చుల కింద బాధితురాలికి మరో రూ. 10 వేలు చెల్లించాలని కూడా ఆదేశించింది. అలాగే, వినియీగదారులకు అందించే సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు రూ. 20 వేల జరిమానా విధించింది. అంటే, ఫ్లిప్‌కార్ట్ మొత్తం రూ. 42,500 పైగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి వడ్డీ మొత్తం కలిపితే ఆ మొత్తం మరింత పెరుగుతుంది. ఏ విధంగా యువతి ఫ్లిప్‌కార్ట్ పై విజయం సాధించింది అన్నమాట. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Bengaluru consumer court fines Flipkart for not delivering cellphone – https://t.co/NSkPCrLj32
— Sree Iyer (@SreeIyer1) January 4, 2023