ప్రాచీనకాలం నుంచి భారతదేశం వ్యవసాయ దేశమే. ఇప్పటికీ చాలామంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే.. అనుకోని ఉపద్రవాలు వారిని నట్టేట ముంచుతున్నాయి. అందులోనూ పల్లెల్లోని పేద రైతు తన పొలంలో సాగుకు పెట్టుబడి పెట్టడానికి అత్యవసరంగా ఒక లక్ష రూపాయలు అప్పు కావాలంటే ఎందరెందర్నో ప్రాథేయపడాల్సిన దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకమే.. కిసాన్ క్రెడిట్ కార్డ్. దీని ద్వారా రైతులు రూ.3 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.
మరి ఇంతకీ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏమిటి? ఎలా పొందాలి? రుణం తీసుకోవడానికి ఉన్న నిబంధనలేమిటి? వడ్డీ ఎంత? తిరిగి తీర్చడం ఎలా? వంటి అన్ని వివరాలూ ఈ కథనంలో.. 1998లో కేంద్ర ప్రభుత్వం కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని ప్రవేశపెట్టింది. పంట వేయడానికి ముందు, తరువాత పెట్టుబడులకు కావాల్సిన డబ్బు తక్కువ వడ్డీతో, సులభ పద్ధతిలో రుణం అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సాగు కోసం అయ్యే పెట్టుబడుల కోసం గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు రుణాలు ఇస్తారు. ఎక్కువగా స్వల్పకాలిక రుణాలే ఇస్తుంటారు. దీర్ఘకాలిక రుణాలు అనేది ఆయా బ్యాంకుల విచక్షణాధికారాలను బట్టి ఉంటుంది
అయితే.. కిసాన్ క్రెడిట్ కార్డుపై రైతులకు రూ.1.60 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తాయి. అంతకంటే ఎక్కువ కావాలంటే పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రుణాలకు 7 నుంచి14 శాతం వరకు వడ్డీ ఉంటుంది. ఈ వడ్డీ అనేది ఆయా బ్యాంకుల విధానాలను బట్టి వేరువేరుగా ఉంటుంది. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించేసిన రైతులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీలో కొంత రాయితీ కూడా ఇస్తుంది. 18 ఏళ్ల వయసు నుంచి 75 ఏళ్ల వయసు లోపు రైతులంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే.. కిసాన్ క్రెడిట్ కార్డు ఉన్న రైతులకు ఉచిత బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ఈ కార్డుదారులు ఏదైనా ప్రమాదం సంభవించి శాశ్వత వైకల్యం కలిగినా, మరణించినా రూ. 50 వేల వరకు పరిహారం ఇచ్చేలా ఉచిత బీమా సదుపాయం ఉంది. ఇతర రిస్కులకు రూ. 25 వేల బీమా ఉంది.