మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. దేశీయ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఈ వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి.
ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌లో రిస్క్ లేనిది ఏదైనా ఉందంటే అది ఫిక్స్‌డ్ డిపాజిటే. అధిక వడ్డీ కోసం ఆశపడి బయట వ్యక్తులకు ఇచ్చి మొదటికే మోసం తెచ్చుకునేకంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎంతో నయం. మన డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు అత్యవసర సమయాల్లో అక్కరకొస్తుంది. అయితే ఏ బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ ఇస్తుందన్నది ఇక్కడ కీలకం. 10 బేస్ పాయింట్లయినా ఎంతో కొంత లాభాన్ని అందించేదే కనుక ఎక్కువ వడ్డీ ఇస్తున్న బ్యాంకులనే ఎంచుకోవాలి. అలా ఎక్కువ వడ్డీ అందిస్తోన్న బ్యాంకు వివరాలను మీకందిస్తున్నాం..
ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. తమ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సవరించిన వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌లో పెట్టింది. ఇతర బ్యాంకుల వడ్డీ రేట్లతో పోలిస్తే యాక్సిస్ బ్యాంక్ సవరించిన వడ్డీ రేట్లు అధికంగానే ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం డిపాజిట్లు 7 రోజుల నుంచి 10 ఏళ్ల టెన్యూర్‌పై సాధారణ కస్టమర్లకు 3.50 శాతం నుంచి 7.00 శాతం వరకు వడ్డీ రేట్లు అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 6 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. అలాగే గరిష్ఠంగా రెండేళ్ల నుంచి 30 నెలల టెన్యూర్ కలిగిన ప్రత్యేక ఎఫ్‌డీపై సాధారణ కస్టమర్లకు 7.26 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.01 శాతం మేర వడ్డీ అందిస్తోంది. ఈ సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 4, 2023 నుంచే అమలులోకి వచ్చాయి.