ఆటో మొబైల్ రంగంలో కియా- హ్యూండాయ్ లకు మంచి పేరుంది. వారి కంపెనీలకు చెందిన కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ, ఇటీవలి కాలంలో వినిపిస్తున్న వార్తలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కంపెనీలకు చెందిన కార్లను రీ కాల్ చేయాలంటూ డిమాండ్ రావడం కూడా కలవరపెడుతోంది.
ఆటో మొబైల్ రంగంలో కార్లకు సంబంధించి దక్షిణ కొరియాకు చెందిన హ్యూండాయ్, కియా కార్లకు మార్కెట్ లో మంచి ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు బ్రాండ్లకు మంచి గుడ్ విల్ కూడా ఉంది. కానీ, ఒక్కసారిగా ఈ బ్రాండ్ కార్లపై ఆరోపణలు వెల్లివెత్తుతున్నాయి. వీటిలో కనీస భద్రతా ప్రమాణాలు కూడా పాటించలేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. అయితే దీని వెనుక ఉన్న అసలు కారణాల ఏంటని చాలా మంది నెట్టింట వెతుకులాట ప్రారంభించారు. ఆ కార్లను వెంటనే రీ కాల్ చేయాలంటూ డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.
సాధారణంగా హ్యూండాయ్- కియా కార్లకు మంచి ఆదరణ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ కార్లపైనే ఎక్కువ ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆ కంపెనీ కార్లను రీ కాల్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనలు జరుగుతోంది భారత్ లో కాదులెండి. ‘అసోసియేట్ ప్రెస్’ కథనం ప్రకారం.. అమెరికాలో 17 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ లక్షల సంఖ్యలో ఉన్న కియా- హ్యూండాయ్ కార్లను వెంటనే రీ కాల్ చేయాలంటూ అభ్యర్థనలు పెడుతున్నారు. అందుకు కారణం అమెరికాలో గత దశాబ్దకాలంలో ఈ కంపెనీలకు చెందిన కార్లలో ఇంజన్ ఇమ్మొబిలైజర్లు లేవు. అందువల్ల ఈ కార్లను ఎంతో సునాయాసంగా దొంగిలిచ్చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
నిజానికి కారులో ఇంజన్ ఇమ్మొబిలైజర్ అనేది అతి ముఖ్యమైన, తప్పకుండా ఉండాల్సిన ఫీచర్ గా భావిస్తుంటారు. కారుని స్క్రూ డ్రైవర్ తో, వైర్లను కలిపి స్టార్ట్ చేయడం మీరు సినిమాల్లో చూసుంటారు. నిజ జీవితంలో అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఆ ఇమ్మొబిలైజర్ కావాలి. ఆ టూల్ కియా- హ్యూండాయ్ కార్లలో లేకోపవడమే ఇప్పుడు ఎక్కువ దొంగతనాలకు కారణంగా ఉందని చెబుతున్నారు. 2022 లాస్ ఏంజిల్స్ లో కియా- హ్యూండాయ్ కార్ల దొంగతనాలు 85 శాతం పెరిగాయి. మొత్తం కార్ల దొంగతనాల్లో 20 శాతం కార్లు ఈ కంపెనీలకు చెందినవే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ దొంగిలించిన కార్ల వల్ల 14 యాక్సిడెంట్స్, 8 మరణాలకు కారణం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ అంశాలను కారణాలుగా చూపుతూ 17 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఫెడరల్ ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపారు.