టాప్ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ ప్రక్రియలో బిజీగా ఉన్నాయి. ఉన్న ఉద్యోగులను తీసేయడమే గాక.. కొత్తగా ఎవర్నీ రిక్రూట్ చేసుకోవడం లేదు. అమెజాన్ సంస్థ కూడా అదే తోవలో వెళ్లాలని ఫిక్స్ అయింది.
ఆర్థిక మాంద్యం భయాలు బడా సంస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందుకే దిగ్గజ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, డెల్ పెద్ద ఎత్తున లేఆఫ్స్ చేపడుతున్నాయి. ఇదే బాటలో నడవాలని నిర్ణయించుకున్న ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 27 వేల మంది ఎంప్లాయీస్‌ను తీసేయాలని డిసైడ్ అయింది. ఉద్యోగుల తొలగింపు అంశంపై ఆ సంస్థ సీఈవో ఆండీ జాస్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. కంపెనీలో 27 వేల మందిని తొలగించడం అనేది చాలా కఠినమైన నిర్ణయం అని ఆయన చెప్పారు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తప్పలేదన్నారు. ఖర్చులను నియంత్రించుకునే చర్యల్లో భాగంగానే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు ఆండీ జాస్సీ.
ఉద్యోగుల తొలగింపు అంశంపై అమెజాన్ అధికారిక వెబ్సైట్లో ఒక లేఖను పోస్ట్ చేశారు ఆండీ జాస్సీ. తమ సంస్థ ఎదుర్కొన్న సవాళ్లను వివరిస్తూ షేర్హోల్డర్లకు సీఈవో వార్షిక లేఖ రాశారు. ఉద్యోగుల తీసివేత నిర్ణయం కష్టమైనదేనని.. కానీ దీర్ఘకాలంలో కంపెనీకి ఇది ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అమెజాన్‌కు చెందిన ఫిజికల్ స్టోర్స్‌ను కూడా మూసివేశామని జాస్సీ తెలిపారు. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ఎఫర్ట్స్‌ను కూడా క్లోజ్ చేశామన్నారు. తొలగింపు తర్వాత ఉద్యోగులకు రావాల్సిన చెల్లింపులు, తాత్కాలిక ఆరోగ్య బీమా ప్రయోజనాలతో పాటు బయట ఉపాధిని కనుగొనడంలోనూ తాము సాయం అందిస్తామని ఆండీ జాస్సీ భరోసా ఇచ్చారు.
In a letter to the shareholders, #AndyJassy said the company’s decision to lay off 27,000 employees was ‘hard’, however, it will prove beneficial in the longer run.#Amazon https://t.co/ovN0A4HVsP
— Hindustan Times (@htTweets) April 14, 2023