చాలామంది ఈరోజు ఎలా గడుస్తోంది అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ, మనం లేకపోతే కుటుంబం ఏమౌతుంది అనే ఆలోచన అంత త్వరగా రాదు. కానీ, ముందుగా మీకు ఆ ఆలోచన రావడమే ముఖ్యం. అలా వస్తే మీరు లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. అయితే మీకోసం ఒక మంచి బీమా పథకం తీసుకొచ్చాం.
సాధారణంగా కుటుంబం మొత్తం కష్టపడి పనిచేయడం, సంపాదించడం చేయరు. ఇంట్లో ఒకరు, ఇద్దరు ఆర్జించేవాళ్లు ఉంటారు. అయితే విధి వక్రించి ఆర్జించే వాళ్లు దూరమైతే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది. అందుకే కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవాళ్లు బీమా పథకం తీసుకుంటూ ఉంటారు. అయితే బీమాలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణలు చెబుతుంటారు. టర్మ్ పాలసీ వల్ల మీకు మెచ్యురిటీ ఫండ్ ఏం రాదు. కానీ, మీ పాలసీ ఉన్నంతకాలం మీకు ఏదైనా జరిగితే పాలసీ మొత్తం నామినీకి అందజేస్తారు. ఈ టర్మ్ పాలసీ కేంద్రం తరఫున ఒక మంచి టర్మ్ పాలసీ ఉంది.
ఈ పాలసీ పేరు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(PMJJBY). ఈ బీమా పథకం 2015లోనే ప్రారంభమైంది. 16.2 కోట్ల మంది ఇప్పటికే ఈ పథకంలో చేరారు. ఇప్పటివరకు 6.64 లక్షల కుటుంబాలకు రూ.13,290 కోట్ల మేర చెల్లింపులు చేశారు. ఈ పథకం అర్హతలు చూస్తే.. 18 నుంచి 50 ఏళ్లలోపు వాళ్లు మాత్రమే ఈ పథకంలో చేరేందుకు అర్హులు. మీకు బ్యాంకులో గానీ, పోస్టాఫీసులో గానీ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. మీ బ్యాంకు ఖాతాని ఆధార్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. మీరు కేవైసీ కూడా తప్పనిసరిగా చేయించాల్సి ఉంటుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే మీకు నచ్చిన బ్యాంకులో ఈ పీఎంజేజేబీవై పథకంలో చేరచ్చు. మీకు 55 సంవత్సరాలు వచ్చే వరకు ఈ బీమా పొందందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు జాయింట్ అకౌంట్ ఉంటే ఇద్దరూ వేరు వేరుగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇది టర్మ్ పాలసీ అంటే ఏడాది కాలవ్యవధితో వస్తుంది. మీరు ఏటా ఆ ప్రీమియం మొత్తం చెల్లిస్తూ ఉండాలి. మీరు అనుసంధానం చేసే బ్యాంక్ ఖాతా సమయానికి ఆటో డెబిట్ అవుతూ ఉంటాయి. ఈ పథకానికి ఏటా రూ.436 చెల్లించాల్సి ఉంటుంది. అంటే మీరు కేవలం నెలకు రూ.36 మాత్రమే కడతారు. 55 సంవత్సరాలలోపు బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు చెల్లిస్తారు. ఈ పాలసీకి కొన్ని షరతులు ఉంటాయి. మీరు ప్రీమియం చెల్లించిన తర్వాత ఏడాది మధ్యలో నిలిపివేయడం, వెనక్కి ఇచ్చేయడం సాధ్యం కాదు. అలాగే మీరు ఎన్ని బ్యాంకుల్లో ఈ పథకం తీసుకున్నా మీకు కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఇస్తారు. 55 ఏళ్ల వరకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పాలసీ దారుడు 55 ఏళ్లకు చేరుకున్న తర్వాత బీమా పథకం రద్దవుతుంది. ఈ బీమా పథకం తీసుకునేందుకు మీరు బ్యాంకు/పోస్టాఫీసులో కనుక్కోవచ్చు.