అక్షయ తృతీయ సందర్భంగా కచ్చితంగా బంగారం కొనాలనే భావన జనాల్లో బలంగా నాటుకుపోయింది. దాంతో చాలా మంది అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు. కొందరు క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోతారు అంటున్నారు నిపుణులు. ఏలానో ఇప్పుడు చూద్దాం.
గత వారం, పది రోజుల నుంచి అక్షయ తృతీయ హడావుడి మొదలైంది. జ్యువెలరీ స్టోర్స్ రకరకాల ఆఫర్లు ప్రకటించి కస్టమర్లును ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. సోషల్ మీడియా సెలబ్రిటీలు కూడా తమ యూట్యూబ్ చానెల్స్ ద్వారా ఆయా జ్యువెలరీ స్టోర్స్‌కి మంచి ప్రచారం కల్పించారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే భారీగా కలిసి వస్తుంది అనే నమ్మకం జనాల్లో బలంగా నాటుకుపోయింది. దీనికి తగ్గట్టే జ్యువెలరీ స్టోర్స్ ప్రచారం, ఆర్భాటం, హడావుడి అన్ని. చేతిలో డబ్బులుండి దుబారా ఖర్చు చేసే బదులు.. బంగారం కొనడం మంచిదే. అలా అని చెప్పి.. అక్షయతృతీయ నాడు ఎలాగైనా సరే బంగారం కొనాలనుకుని.. అప్పు చేసి మరీ కొనేవారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరగడంతో.. మరి కొందరు.. దాని ద్వారా బంగారం కొంటున్నారు. ఒకవేళ మీరు కూడా క్రెడిట్ కార్డు మీద బంగారం కొనాలనే ఆలోచనలో ఉంటే ఒక్కసారి ఇది చదవండి. ఎంత భారీగా నష్టపోతారో మీకే అర్థం అవుతుంది.
క్రెడిట్ కార్డు అంటే అత్యవసర సమయంలో.. చేతిలో ఒక్క రూపాయి లేక.. ఎక్కడ డబ్బులు సర్దుబాటు కానీ సందర్బంలో మాత్రమే వాడాలి. కానీ నేటి కాలంలో చాలా మంది.. కిరాణ షాపులు మొదలు.. జ్యువెలరీ స్టోర్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్ వాడుతున్నారు. ఆ తర్వాత తడిసిమోపడైన బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక నేడు అక్షయ తృతీయ సందర్భంగా చాలా మంది క్రెడిట్ కార్డు మీద బంగారం కొనాలని భావిస్తున్నారు. కానీ ఇలా చేయడం వల్ల మీరు భారీగా నష్టపోతారు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే క్రెడిట్ కార్డు మీద బంగారం కొంటే.. అప్పు చేసి కొన్నట్లే. ఇలా చేస్తే.. మీ ఆర్థిక భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు.
క్రెడిట్ కార్డు వాడి బంగారం కొనుగోలు చేయవద్దు అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ప్రస్తుత కాలంలో అన్ని ప్రముఖ బంగారు దుకాణాలు కూడా క్రెడిట్ కార్డును యాక్సెప్ట్ చేస్తున్నాయి. మీరు గనక క్రెడిట్ కార్డు మీద బంగారు ఆభరణాలు కోనుగోలు చేస్తే.. నిర్ణీత గడువులోపు ఆమొత్తం ఒకేసారి చెల్లించడం బెటర్. అలా కాదని.. బంగారం కొన్న తర్వాత.. ఆమొత్తాన్ని.. ఈఏంఐ ఆప్షన్ కింద తీసుకొని ఫ్లెక్సీ పే కింద నెలనెలా కట్టాలని అనుకుంటే మాత్రం మీరు భారీగా నష్టపోతారు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే క్రెడిట్ కార్డు ఈఎమ్ఐలపై దాదాపు 18నుంచి 30 శాతం వరకు వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీకు అదనపు భారమే అవుతుంది. అందుకే ఇలా క్రెడిట్ కార్డు మీద బంగారం కొనాలనే ఆలోచన ఉంటే విరమించుకొండి అని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న రేట్లలో తులం బంగారం కొనాలన్నా ఎంత లేదన్నా.. 60 వేల పైచిలుకు ఖర్చు చేయాలి. మన మన చేతిలో అంత మొత్తం ఎప్పుడు ఉండదు.. మరి బంగారం కొనాలంటే.. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా.. అయితే మీకు సిప్ పద్దతి బెటర్. ఈ విధానంలో ప్రతి నెల సిప్ పద్ధతిలో, కొంచెం కొంచెం డబ్బు జమ చేసుకొని సంవత్సరంలో ఒకేసారి మీరు దాచిన డబ్బుకు సరిపడా బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేసి ప్రతి నెల అందులో నిర్ణీత మొత్తంలో డబ్బు దాచుకోవాలి. ఆ డబ్బు మెచ్యూరిటీ అయ్యాక ఆ మొత్తంతో మీరు బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. మీరు రికరింగ్ ఖాతాలో పొదుపు చేసిన డబ్బుపై వడ్డీ కూడా లభిస్తుంది. కనుక ఈ పద్దతిలో మీరు బంగారం కొనుగోలు చేస్తే లాభమే కానీ.. నష్టం లేదు.
చేతిలో సరిపడా నగదు లేకపోయినా బంగారం కొనుగోలు చేయవచ్చు అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ఎలా అంటే డిజిటల్ రూపంలో. ఈ విధానంలో మీరు ఒక్క రూపాయితో కూడా బంగారాన్ని కొనుగోలు చేసే వీలుంది. తద్వారా మీరు కొన్న బంగారం మీ డిజిటల్ వ్యాలెట్‌లో భద్రంగా ఉంటుంది. మీ వద్ద సరిపడా నిధులు ఉన్నప్పుడు ఈ డిజిటల్ వాలెట్‌లో అరగ్రామ్ నుంచి ఒక గ్రాము వరకు బంగారం ఉన్నట్లయితే, దాన్ని మీరు నాణెం రూపంలో హోమ్ డెలివరీ పొందే వీలుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరి క్రెడిట్ కార్డు ద్వారా బంగారం కొనడం మంచిదే అని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.