ఒక్క రిపోర్టుతో అదానీ గ్రూప్‌ను కుదేలు చేసిన హిండెన్‌బర్గ్.. మరో బాంబును పేల్చేందుకు రెడీ అవుతోంది. ఈసారి ఎవర్ని టార్గెట్ చేయనుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కేవలం ఒకే ఒక్క నివేదికతో అదానీ గ్రూప్‌ను కుదేలు చేసింది హిండెన్‌బర్డ్. అమెరికాకు చెందిన ఈ షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ కంపెనీ మరో బాంబ్ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ సంస్థల మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను అతి త్వరలో రిలీజ్ చేస్తామని ట్విటర్ ద్వారా హిండెన్‌బర్గ్ తెలియజేసింది. అయితే ఈసారి ఎవరిమీద బాంబు పడుతుందోనని మార్కెట్ వర్గాల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇక, హిండెన్‌బర్గ్ నివేదిక విడుదలైనప్పటి నుంచి అదానీ గ్రూప్ నమోదిత కంపెనీల షేర్లు భారీ ఎత్తున నష్టపోయిన విషయం అందరికీ విదితమే.
అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 140 బిలియన్ డాలర్లకు పైగానే ఆవిరైందని తెలుస్తోంది. అంతకుముందు వరకు అంతర్జాతీయ సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ రెండో ప్లేసులో ఉన్నారు. హిండెన్‌బర్గ్ ఉదంతం తర్వాత అదానీ గ్రూప్ కంపెనీలతో పాటు ఆయన వ్యక్తిగత సంపద కూడా కరిగిపోయింది. ఇకపోతే, అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందంటూ గత జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఓ నివేదికను వెలువర్చింది. అదానీ గ్రూప్ దశాబ్దాలుగా స్టాక్ మార్కెట్‌లో అక్రమాలకు పాల్పడిందంటూ ఆ రిపోర్టులో హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది.
మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న అనేక మందితో మాట్లాడి, వేలాది డాక్యుమెంట్‌లను పరిశీలించి ఈ రిపోర్టును వెలువరించామని హిండెన్‌బర్గ్ తెలిపింది. ఈ నివేదిక విడుదలైన ఐదు వారాల సమయంలోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకు పైగా తుడిచిపెట్టుకుపోయింది. భారత్‌లో రిచెస్ట్ పర్సన్‌గా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయారు. అదానీ గ్రూప్ కూడా ఎవరూ ఊహించని విధంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేసిన రూ.20 వేల కోట్ల ఎఫ్‌పీవోను కూడా ఉపసంహరించుకుంది. అయితే హిండెన్‌బర్గ్ తమపై చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ కొట్టిపారేయడం గమనార్హం. మరి.. ఈసారి హిండెన్‌బర్గ్ ఎవర్ని టార్గెట్ చేయబోతోందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.