‘స్టాక్ మార్కెట్’.. ఇదొక మాయావిశ్వం.. తెలియని విషయాలు ఎన్నో ఇందులో దాగుంటాయి. పెట్టుబడులు పెడితే కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చిపడిపోతాయనేది చాలామంది భావన. కానీ, అదే వాస్తవం కాదు. ఇన్వెస్ట్ చేసినవారు ఒక్క చిన్న మాటతో.. ఒకే ఒక్క గంటలో వీధిన పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి బడా బడా కంపెనీలు.. బ్యాంకులు కూడా నష్టాలను చవిచూస్తుంటాయి. తాజాగా భారత షేర్ మార్కెట్ ను కుదుపేసిన ‘అదానీ -హిండెన్‌బర్గ్ వివాదం’ అలాంటిదే. ప్రముఖ బిజినెస్ మ్యాన్ గౌతం ఆదానీకి చెందిన వ్యాపార సంస్థలు షార్ట్ సెల్లింగ్, స్టాక్ మ్యానిప్యులేషన్, అకౌంటింగ్ మోసాలు, షేర్లలో అవకతవకలకు పాల్పడుతున్నాయంటూ అమెరికన్ రీసెర్చ్ ఫిర్మ్ ‘హిండెన్‌బర్గ్’ విడుదల చేసిన ఒక నివేదిక దేశీయ కార్పొరేట్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఇక్కడ భారీ నష్టాలను చవిచూసింది అదానీ ఒక్కరే అయినా.. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టే ప్రతిఒక్కరు భయపడ్డారు.
ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ లో ఎక్కువుగా వినపడుతున్న పేరు.. షార్ట్ సెల్లింగ్. హిండెన్‌బర్గ్ ఆరోపణల్లో వాస్తవమెంతో తెలియదు కానీ, షార్ట్ సెల్లింగ్ వల్ల కోట్లు గడించొచ్చా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి..? కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు..? లాభాలు ఎలా వస్తాయి..? వంటి ప్రశ్నలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో షార్ట్ సెల్లింగ్ గురుంచి మరింత సమాచారం మీ ముందుకు. సాధారణంగా షేర్ మార్కెట్ / స్టాక్ మార్కెట్ అనేది కంపెనీ వాటా (స్టాక్/షేర్) లు కొనుగోలు, అమ్మకము జరుపుటకై ఏర్పరచిన ఒక వాణిజ్య సముదాయం. ఇక స్టాక్ ఎక్స్చేంజ్ లు అంటారా..? ఆయా కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం/విక్రయించడానికి అనుమతించే ఒక మధ్యస్థ సంస్థలు.
సాధారణంగా స్టాక్ మార్కెట్ లో ఒక కంపెనీ షేర్ల ధరలు రానున్న రోజుల్లో పెరుగుతాయనే ఉద్దేశంతో వాటిని కొనడం, అనుకున్నట్లుగా ధరలు పెరిగినప్పుడు ఈ షేర్లను అమ్మి, లాభాలు గడిస్తుంటారు. ఇది నిత్యం జరిగేదే. కానీ షార్ట్ సెల్లింగ్.. దీనికి వ్యతిరేకం. ఇది చట్టబద్ధమైనది. రిస్క్ కూడా ఎక్కువ. ఇందులో షేర్లు కొనడం ఉండదు. స్టాక్ బ్రోకర్ నుంచి షేర్లను అప్పుగా తీసుకొని.. వాటిని ప్రస్తుత మార్కెట్ ధర వద్ద అమ్ముతారు. ఆ తరువాత కొన్ని రోజులు గడిచాక షేర్ల ధరలు తగ్గుముఖం పట్టాక తిరిగి వాటిని కొంటారు. ఇక్కడ అప్పు తీసుకున్న షేర్లను బ్రోకర్‌కు ఇచ్చేసి, మిగిలిన లాభాన్ని జేబులో వేసుకుంటారు.
ఉదాహరణకు, రానున్న రోజుల్లో ఒక కంపెనీ షేర్ల ధరలు పడిపోతాయని ఒక షార్ట్ సెల్లర్ ముందుగా ఊహించారనుకోండి. ప్రస్తుతం మార్కెట్ లో ఆ కంపెనీ షేర్ విలువ రూ.100 అనుకుందాం.. వెంటనే షార్ట్ సెల్లర్ ఏం చేశారు.. ఆ కంపెనీ యొక్క 100 షేర్లను బ్రోకర్ నుంచి అప్పుగా తీసుకొని.. వాటిని రూ.100 దగ్గర అమ్మేశారు. అప్పుడు ఆ వ్యక్తి చేతికి రూ.10 వేలు వస్తాయి. కొన్నాళ్లు గడిచాక సదరు కంపెనీ షేర్ విలువ సగానికి పడిపోయింది అనుకోండి.. వెంటనే అతడు సగం ధరకే 100 షేర్లను కొని అప్పు తీసుకున్న షేర్లను బ్రోకర్ కు రిటర్న్ చేస్తాడు. ఈ ప్రాసెస్ జరిగాక సెల్లర్ చేతిలో రూ. 5,000 మిగులుతాయి. ఈ మొత్తంలో పన్నులు పోను మిగిలింది ఆ వ్యక్తి లాభం. ఇందులో రిస్క్ కూడా ఎక్కువ. అనుకున్నట్టుగా షేర్ ధరలు పడిపోతే పర్లేదు.. పెరిగితే తీవ్ర నష్టాల్ని చవిచూడాల్సి ఉంటుంది. అందులోనూ.. షార్ట్ సెల్లింగ్ చేయడానికి మొత్తం డబ్బు అవసరం లేదు. మార్జిన్‌గా కొంత అకౌంట్‌లో ఉంచితే సరిపోతుంది. అదానీ సంస్థలపై ‘హిండెన్‌బర్గ్’ చేసిన ఆరోపణల్లో ఇది కూడా ఒకటి. షార్ట్ సెల్లింగ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
After Hindenburg Research published a report last week on Adani Group and its alleged accounting fraud, short selling has become a hot topic.
Here’s more🔻https://t.co/C9FqnJGSZD#HindenburgResearch #AdaniGroup #Adani
— Moneycontrol (@moneycontrolcom) February 4, 2023