హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్ అతలాకుతలమవుతోంది. ఆ గ్రూప్‌కు రుణాలు ఇచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ షేర్లను తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలను ముందుగా చెల్లించేందుకు రెడీ అయింది. వాస్తవానికి 2024 సెప్టెంబర్ వరకు చెల్లింపు గడువు ఉన్నప్పటికీ అదానీ గ్రూప్ రుణాలను ముందే చెల్లించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. సుమారుగా 1,114 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది. బ్యాంకులకు తాకట్టు పెట్టిన వాటిలో అదానీ పోర్ట్స్‌కు సంబంధించిన 168.27 మిలియన్ డాలర్లు, అదానీ గ్రీన్‌లో 27.56 మిలియన్ షేర్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 11.77 షేర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
కాగా, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా నష్టపోయింది. షేర్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ విలువ సగానికి పైగా పతనమైంది. దీంతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ ను ‘సస్టెయినబుల్ సూచీ’ నుంచి తొలగిస్తున్నట్లు యూఎస్‌కు చెందిన ఎస్ అండ్ పీ డోజోన్స్ వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఈ నెల 7న ‘డోజోన్స్ సస్టెయినబిలిటీ సూచీ’లో సవరణలు చేయనున్నట్లు తెలిపింది. ఇకపోతే, అదానీ గ్రూప్ వ్యవహారం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు కంపెనీ షేర్ల పతనం, మరోవైపు ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు గౌతమ్ అదానీ చర్యలు చేపడుతున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అందులో భాగంగానే తనఖా పెట్టిన షేర్లను విడిపించుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారని నిపుణులు అంటున్నారు. మరి.. హిండెన్‌బర్గ్ నివేదికతో అతలాకుతలమవుతున్న అదానీ గ్రూప్.. త్వరలో దీని నుంచి తేరుకుంటుందని మీరు భావిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.