కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు. మనకి వచ్చిన పనులే మనల్ని అందనంత ఎత్తులో కూర్చోబెడతాయి. ఒక మహిళ పచ్చళ్ళు పెట్టడాన్ని వ్యాపారంగా మార్చుకుని ఇవాళ లక్షల్లో సంపాదిస్తున్నారు. వంట గదిలో ఉంటూనే పచ్చళ్ళు తయారు చేసి ఇవాళ ఆమె అతి పెద్ద పచ్చళ్ళ వ్యాపార సామ్రాజ్యానికి యువరాణి అయ్యారామె.
మహిళలను వంటింటి కుందేలు అని అంటారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పని చేస్తూనే ఉంటారు. ఎన్నాళ్లిలా వంటింట్లో కుందేలులా ఉంటామని చెప్పి ఈ చురుకుతనాన్ని ఉపాధిగా మార్చుకోవాలని కొంతమంది తమకు నచ్చిన రంగాల్లో స్థిరపడుతున్నారు. అయితే ఉద్యోగం, లేదంటే వ్యాపారం చేసుకుంటూ తమ అభిరుచిని చాటుకుంటున్నారు. ఒక పక్క ఇంటి పనులు చక్కబెడుతూనే.. మరో పక్క ఉద్యోగం, వ్యాపార రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇటీవల కాలంలో వ్యాపారం చేసే మహిళల సంఖ్య బాగా పెరిగింది. అయితే ఓ మహిళ వంటింట్లో ఉంటూనే లక్షలు సంపాదిస్తున్నారు. మనమంతా ఇష్టపడి తినే ఆహారాన్ని ఆమె బిజినెస్ గా మార్చుకున్నారు.
పచ్చళ్ళు చాలా మంది ఇష్టంగా తింటారు. పప్పులో, పెరుగన్నంలో ఆవకాయ పచ్చడి, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, గోంగూర ఇలా రకరకాల పచ్చళ్ళు వాడుతుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి పచ్చళ్ళు పెట్టుకోవడం రాదు. అందరూ బయట మార్కెట్ మీదనే ఆధారపడిపోతున్నారు. అయితే బయట కంపెనీలు పచ్చళ్లలో రసాయనాలు కలుపుతాయి. ఈ పచ్చళ్ళు తింటే అనారోగ్యానికి గురవుతారు. పచ్చళ్ళు కొనుక్కునేవారికి రుచితో పాటు ఆరోగ్యంతో కూడిన పచ్చళ్ళను తయారుచేసి అమ్మితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనతో మొదలైందే ‘సుగర్ణీచే లోణ్చే’ కంపెనీ. ఆంగ్లంలో సమర్థ్ ఫుడ్స్ అని పేరు పెట్టారు. మహారాష్ట్రలోని లాతూర్ కి చెందిన ప్రీతమ్ జాదవ్ అనే మహిళ కరోనా సమయంలో ఈ పచ్చళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించారు. 56 రకాల పచ్చళ్ళను తయారు చేసి అమ్ముతున్నారు.
ఈమెకు వంట చేయడం అంటే బాగా ఇష్టం. వంట వచ్చింది కాబట్టి ఈమె ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒకసారి ఇంట్లోనే స్వయంగా రకరకాల పచ్చళ్ళు తయారుచేసి ఇంట్లో వాళ్ళకి, బంధువులకు ఇచ్చేవారు. అవి బాగున్నాయని టాక్ రావడంతో ఆమె పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. 56 రకాల పచ్చళ్ళు తయారు చేయవచ్చునని తెలుసుకుని సొంతంగా ఈ బిజినెస్ ని ప్రారంభించారు. ఈమె పచ్చళ్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందరూ బాగుందని, రుచిగా, నాణ్యతగా ఉన్నాయని అంటున్నారు. ఈమె ఈ పచ్చళ్ళను సాంప్రదాయ పద్ధతిలో మాత్రమే తయారు చేస్తారు. అందుకే జనం ఎగబడి కొంటున్నారు.
రసాయనాలు కలపకూడనేది ఈమె కాన్సెప్ట్. సరైన మోతాదులో ఉప్పు, మిరపకాయలు, మసాలా దినుసులు వేసి కలపడం ద్వారా రుచికరమైన పచ్చళ్ళను తయారుచేస్తున్నారు. ఈమె పచ్చళ్లకు లాతూర్ లోనే కాదు మహారాష్ట్ర నలుమూలలా మంచి గిరాకీ ఉంది. ఉసిరి, తడి పసుపు, వెల్లుల్లి, కరివేపాకు, నిమ్మ, ఉపవాస పచ్చళ్ళు బాగా అమ్ముడవుతున్నాయి. కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలు మూతబడితే.. ప్రీతమ్ జాదవ్ మాత్రం ధైర్యంగా ఫుడ్ బిజినెస్ ని ప్రారంభించి సక్సెస్ అయ్యారు. ఆమె మాత్రమే కాకుండా ఇప్పుడు ఆమె దగ్గర అనేక మంది మహిళలు పని చేస్తున్నారు. ఏటా కొన్ని లక్షల టర్నోవర్ బిజినెస్ చేస్తున్నారు. వంట గదిని కూడా ఉపాధి మార్గంగా మలచుకుని ఆమె ఎదిగిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.