సాధారణంగా 65 ఏళ్ల వయసు మళ్లిన వారు ఎవరైనా.. అడుగు తీసి అడుగు వేయాలంటే భయపడుతుంటారు. ఎక్కడ కింద పడతామో.. ఎక్కడ మంచానికి పరిమితమవుతామో అన్న భయం వారిలో అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. పైగా మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పులు అంటూ ఒకటే గొణుగుతూ ఉంటారు. ఇలాంటి సన్నివేశాలు ప్రతి ఇంట్లో ఉండేవే.. ప్రతి ఒక్కరూ చూసినివే. కానీ, ఈ బామ్మ అందుకు విభిన్నం. 65 ఏళ్ల వయసులోనూ యుక్త వయసురాలిగా అన్ని పనులు చేస్తోంది. పైగా పాల వ్యాపారం చేస్తూ ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తోంది. ఈ బామ్మ ఎవరు..? కేవలం పాడి పరిశ్రమ ద్వారా ఇంత ఆదాయం ఎలా సంపాదించగలుగుతున్నారు వంటి వివరాలు మీకోసం..
పేరు.. నవల్‌బీన్ దల్సంభాయ్ చౌదరి. వయసు 65 ఏళ్లు. గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా, నబానా గ్రామం. దల్సంభాయ్.. పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు.. గ్రామంలో తాను ఒక్కరిలా చిన్న చిన్న పనులు చేసుకునేది. అప్పుడే ఒక ఆలోచన తన మదిని తట్టింది. వయసులో ఉన్నప్పుడు కూలీ పనులు చేసుకుంటూ కాలం గడుపుతున్నాం.. కానీ, వయసు పైబడ్డాక ఏం పనులు చేసుకోగలం అని ఎప్పుడు ఆలోచించేది. ఆ ఆలోచనే.. పాడి పరిశ్రమ పెట్టాలన్న నిర్ణయానికి పునాది వేసింది. అలా 15 ఏళ్ల క్రితం 15 గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించింది దల్సంభాయ్. కాల క్రమేణా ఆ 15 గేదెలు కాస్తా 250కి పైగా విస్తరించాయి.
ప్రస్తుతం.. ఆ గేదెల ద్వారా ఆమె ప్రతి రోజూ 11 వందల లీటర్ల పాలు సరఫరా చేస్తోంది. ప్రతి 15 రోజులకు 7 నుంచి 8 లక్షల రూపాయలు ఆమె బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంటాయి. ఈ లెక్కన నవల్‌బీన్ ఏడాదికి కోటీ 25 లక్షల ఆదాయం అర్జిస్తున్నారు. అంతేకాదు.. దల్సంభాయ్ ఆలోచన పది పది కుటుంబాలకు కొత్త జీవితాన్నిచ్చింది. ఆమె నడుపుతున్న డైరీలో 10 మంది పనిచేస్తున్నారు. వారి నెల జీతం రూ.లక్షన్నరకు పైనే. మహిళా సాధికారతకు నవల్‌బీన్ చక్కని ఉదాహరణగా చెప్తున్నారు. ఆరవై ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ విజయవంతంగా పాల వ్యాపారం నడపడం చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్యర్యపోతున్నారు. కష్టపడాలన్నా దృఢ సంకల్పం మనుసులో ఉండాలి కానీ, సంపాదనకు వయసు, చదువు అడ్డంకి కాదని నిరూపిస్తోంది.. ఈ బామ్మ. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.