లాక్ డౌన్ కారణంగా దేశంలో చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువుల్ని ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఐతే కొన్నిసార్లు ఆన్‌లైన్ షాపింగ్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యక్తికి ఆన్‌లైన్ షాపింగ్‌లో డెలివరీ చేసిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. మౌత్ వాష్ కోసం అమెజాన్‌లో ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి రెడ్‌మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయింది. ఆశ్చర్యపోయిన ఆయన జరిగిన పొరపాటును అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి మనం ఆర్డర్ చేసే వస్తువులే మనకు డెలివరీ అవుతుంటాయి. కానీ కొన్ని సార్లు జరిగే పొరపాట్ల వల్ల మనం ఆర్డర్ చేసే వస్తువులు కాకుండా వేరే వస్తువులు వస్తుంటాయి. ఇక కొన్ని సందర్భాల్లో మనకు రావల్సిన వస్తువులకు బదులు ఇటుకలు, రాళ్లు, సబ్బులు వస్తుంటాయి. అయితే ఆ వ్యక్తికి అలా జరగలేదు. కానీ అతను ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేరే వస్తువు వచ్చింది. ముంబైకి చెందిన లోకేశ్ అనే వ్యక్తి రూ.459 విలువైన నాలుగు కోల్గెట్ మౌత్ వాష్‌ల కోసం ఇటీవల అమెజాన్‌లో ఆర్డర్ చేశారు. అయితే ఆయనకు వాటి బదులు రూ.13,000 విలువైన రెడ్‌మీ నోట్ 10 మొబైల్ ఫోన్ డెలివరీ అయ్యింది. ప్యాకెట్ తెరిచి చూసిన ఆయన లోపల మొబైల్ ఫోన్ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. ప్యాకెట్‌పై తన అడ్రస్ ఉండగా లోపల బిల్లు మాత్రం తెలంగాణకు చెందిన మరో వ్యక్తి పేరుతో ఉన్నది.
లోకేశ్ దానిని తిరిగి ఇచ్చేందుకు అమెజాన్ యాప్‌లో ప్రయత్నించారు. అయితే మౌత్ వాష్ వినియోగించే వస్తువు కావడంలో సాధ్యపడలేదు. ఈనేపథ్యంలో లోకేశ్ జరిగిన పొరపాటును మెయిల్ ద్వారా అమెజాన్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేగాక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో అది వైరల్ అయింది. చాలా మంది నెటిజన్లు లోకేష్ నిజాయితీని మెచ్చుకున్నారు. ఆ మొబైల్ ఫోన్‌ను అమెజాన్ ఆయనకు బహుమతిగా ఇవ్వాలంటూ కొందరు ఫన్నీగా కామెంట్ చేశారు.