పండగ వేళ బంగారం కొనాలనుకుంటున్నారా..! ఐతే మీకో గుడ్ న్యూస్. గత పది రోజులగా పరుగులు పెట్టిన పసిడి ధర నేడు భారీగా దిగొచ్చింది.
గత పది రోజులగా పసిడి ధరలు పరుగులు పెడుతున్న సంగతి అందరికీ విదితమే. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా సోమవారం ఒక్కరోజే దేశీయ మార్కెట్‌లో బంగారం ధర ఏకంగా రూ.1400 మేర పెరిగి రూ.60వేల మార్కును దాటేసింది. ఆపై మంగళవారం రోజు 500 రూపాయల మేర తగ్గి కాస్త ఉపశమనం కలిగించినా.. బంగారం కొనాలనే ఆలోచనకు మాత్రం దూరంగా ఉన్నారు. అలాంటి వారికి పండగ వేళ విశేషం.. శుభవార్త అందింది. ఉగాది వేళ పసిడి ధర భారీగా తగ్గింది. ఏకంగా రూ.800 మేర తగ్గి రూ.60వేల మార్కును దిగొచ్చింది.
భారతీయులకు, అందునా మగువలకు పసిడి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పురుషులు బంగారం ధరించినా, అది ఆకర్షణకే తప్ప మగువుల అందానికి సాటిరాదు. అందువల్లే.. పసిడిని మగువలకు తీపి వస్తువుగా పరిగణిస్తారు. ఇదిలావుంచితే, ఇటీవల కాలంలో పసిడి ధర పరుగులు పెడుతోన్న సంగతి అందరికీ తెలిసిందే. కొనాలనే ఆలోచన పక్కనపెడితే, దాని వంక చూడాలంటేనే భయపడేలా చేస్తోంది. పైగా రాబోవు నెలల్లో బంగారం ధర 70వేల మార్కు దాటుతుందని మార్కెట్ నిపుణులు చెప్తుండటం గమనార్హం. ఏదేమైనా ఉగాది పండగ వేళ పసిడి ధర తగ్గుముఖం పట్టడం కొనుగోలు దారులకు శుభపరిణామమే.
మంగళవారంతో పోలిస్తే బుధవారం 22 క్యారెట్ల పసిడి ధర పది గ్రాములకు రూ.800 తగ్గి.. రూ.54,200గా ఉంది. అదే 24 క్యారెట్ల పసిడి ధరను చూస్తే.. రూ.870 మేర తగ్గి.. రూ.59,130 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రముఖ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్నంలో ఇవే ధరలు ఉన్నాయి.
ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,670గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,200గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,130గా ఉంది. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,350గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,280గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 54,250గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,180గా ఉంది. ఇక వెండి ధర కిలో రూ. 74,000గా ఉంది.