బడ్జెట్ లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? 25 లక్షల్లో మంచి 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? మంచి ఏరియాలో కొనాలని భావిస్తున్నారా? ఐతే మీ కోసమే ఈ కథనం.
హైదరాబాద్ లో సిటీలో 2 బీహెచ్‌కే ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 50 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. ఇక స్థలానికైతే అది కాని పని. ఐతే నార్త్ హైదరాబాద్ సిటీకి 20 కి.మీ. దూరంలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో స్థలం రేట్లు, ఫ్లాట్ ధరలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలా అని ఆ ప్రాంతం ఏమీ మారుమూల ఉండదు, అభివృద్ధికి ఆమడ దూరంలో అస్సలు ఉండదు. అక్కడ కూడా కంపెనీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు ఉన్నాయి. హైదరాబాద్ కి రావాలంటే ట్రాఫిక్ లో 45 నిమిషాలు పడుతుంది. సికింద్రాబాద్ కి 22 కి.మీ. దూరంలో ఉంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి దగ్గరగా ఉంటుంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉంది. పచ్చని కొండల మధ్యలో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు ఇది బాగా నచ్చుతుంది. వాతావరణం కూడా చాలా బాగుంటుంది.
ఆ ఏరియా పేరు షామీర్ పేట్. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో ఉంది. ఇక్కడ జవహర్ డీర్ పార్క్, షామీర్పేట్ లేక్, షామీర్పేట్ గోల్ఫ్ కోర్స్ సహా పలు పాపులర్ టూరిస్ట్ ప్రదేశాలు ఉన్నాయి. లగ్జరీ రెస్టారెంట్లు, రిసార్ట్ లు వంటివి ఉన్నాయి. బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వంటి విద్యాసంస్థలు ఉన్నాయి. పలు హాస్పిటల్స్, క్లినిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ ఏరియాలో రియల్ ఎస్టేట్ గ్రోత్ అనేది బాగుంది. హైదరాబాద్ కి దగ్గరగా ఉండడం, టూరిస్టులకు డెస్టినేషన్ స్పాట్ కావడం వల్ల ఈ ఏరియా అనేది వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ విల్లాలు, అపార్టుమెంట్లు, రిసార్ట్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం అనేది మంచి అవకాశంగా నిపుణులు చెబుతున్నారు.
స్థలాల మీద పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ ఏరియాలో గేటెడ్ కమ్యూనిటీలు కూడా డెవలప్ అయ్యాయి. స్విమ్మింగ్ పూల్స్, క్లబ్ హౌసులు, ఫిట్నెస్ సెంటర్లు వంటి అనేక సౌకర్యాలతో కూడిన లగ్జరీ విల్లాలు, ఫ్లాట్లు కూడా ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్ లో ఫ్లాట్ కొనాలనుకోవడం ఉత్తమమైన ఛాయిస్ అని చెబుతున్నారు. ఈ ఏరియాలో ప్రస్తుతం హెచ్ఎండీఏ ప్రకారం గజం స్థలం రూ. 20 వేల పైనే ఉంది. చదరపు అడుగు స్థలం రూ. 2050 నుంచి రూ. 3,300 మధ్యలో ఉన్నాయి. ఫ్లాట్ ధరలు ఐతే చదరపు అడుగుకు రూ. 2,150 నుంచి రూ. 3,800 పలుకుతున్నాయి. ఈ ఏరియాలో 2 బీహెచ్‌కే ఫ్లాట్ సొంతం చేసుకోవాలంటే రూ. 21,50,000 నుంచి రూ. 38 లక్షలు అవుతుంది. అదే బీహెచ్‌కేకి సరిపోయే స్థలం కొనుగోలు చేయాలంటే రూ. 20,50,000 నుంచి రూ. 33 లక్షలు అవుతుంది. 1 బీహెచ్‌కే స్థలానికి ఐతే రూ. 10 లక్షల నుంచి 18 లక్షల బడ్జెట్ లో వస్తుంది. 1 బీహెచ్‌కే ఫ్లాట్ కావాలనుకుంటే రూ. 13 లక్షల నుంచి రూ. 23 లక్షల బడ్జెట్ లో దొరుకుతుంది.