బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రసవత్తరంగా మారుతోంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు కూడా ఈ షోపై సానుకూలంగా స్పందిస్తున్నారు. హౌస్‌లో చివరి కెప్టెన్ అయ్యి ఇనయా సుల్తానా సెమీఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక సభ్యుడు ఫైనలిస్ట్ అయ్యేందుకు ఇంకో అవకాశాన్ని ఇస్తున్నారు. టికెట్ టూ ఫినాలే అని టాస్కును పెట్టారు. మొదటి దశలో స్నో మ్యాన్‌లను తయారు చేయాలని చెప్పగా అందులో శ్రీసత్య, కీర్తీ, ఇనయా సుల్తానాలు ఓడిపోయారు. ఆ ముగ్గురిలో ఒకరికి మరో అవకాశం ఇచ్చేందుకు ఒక టాస్కు పెట్టారు. అందులో ఎవరు ఎక్కువ రంగు పూస్తారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ముందు ఇనయా, కీర్తీ కలిసి శ్రీసత్యను ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత కీర్తీ కంటే ఇనయా ఎక్కువ రంగు పూయగా.. సంచాలక్ రేవంత్ మాత్రం కీర్తీని సేవ్ చేస్తాడు.
ఇప్పుడు నెక్ట్స్ లెవల్ ఆఫ్ టికెట్ టూ ఫినాలే నడుస్తోంది. అందులో ఒక టాస్కు పెట్టారు. చాలా అవరోధాలను పెట్టి వాటిని దాటుకుని బాస్కెట్‌లో బాల్ వేయాల్సి ఉంటుంది. ఉందులో మొత్తం ఆరుగురు ఉండగా వారిలో నుంచి తదుపరి సవాలును ఎదుర్కొనేందుకు నలుగురు ఇంటి సభ్యుల పేర్లను ఏకాభిప్రాయంతో చెప్పండి అంటూ ఝలక్ ఇచ్చాడు. అయితే ఆ దెబ్బతో ఇంటి సభ్యులకు మబ్బులు విడిపోయాయి. అసలు టికెట్ టూ ఫినాలేలో ఏకాభిప్రాయం ఏంటి? అనే ప్రశ్నను లేవనెత్తారు. నిజానికి ప్రేక్షకులకు కూడా అదే ప్రశ్న వచ్చిందనుకోండి. గేమ్ ఆఖరికి వచ్చాక ఎవరికి వాళ్లు గెలవాలి అనుకుంటారు. అంతేగానీ, ఇంకొకరు గెలవాలని ఎందుకు అనుకుంటారు?
అదే విషయాన్ని ఇంటి సభ్యులు కూడా లేవనెత్తారు. మొత్తానికి బిగ్ బాస్‌కి ఇంటి సభ్యులకు మధ్య పెద్ద గొడవ జరిగేట్టుగానే ఉంది. ఎందుకంటే టికెట్ టూ ఫినాలే అనేది గోల్డెన్ ఛాన్స్ అలాంటి ఛాన్స్ ని ఎవరూ ఎవరికీ ఇవ్వాలి అనుకోరు. ఎవరికి వాళ్లే గెలవాలి అనుకుంటారు. అయితే అందరిలో శ్రీహాన్ ఒకడుగు ముందుకేసి బిగ్ బాస్‌కే వార్నింగ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే అనేది నాకు చాలా ముఖ్యం. నేను ఆడాలి అనుకుంటున్నాను. ఒకవేళ అలా నేను ఆడేందుకు నాకు అవకాశం ఇవ్వకపోతే ఓ ఒక్క ప్లేట్ ని కూడా మిగలనివ్వను అంటూ బిగ్ బాస్‌కే కాదు.. ఇంట్లోని సభ్యులకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ పెట్టిన ఈ మెలికపై అటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అంటూ ప్రోమో కింద కామెంట్లు పెడుతున్నారు.