తెలుగు బుల్లితెర పై అత్యంత ప్రజాదరణ పొందిన షోలల్లో బిగ్ బాస్ ఒకటి. ఈ షో ప్రారంభం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే దీనికి అభిమానులు ఎక్కువ. ఇప్పడు బిగ్ బాస్ 6 సందడి మెుదలైంది. హౌజ్ లోకి ఒక్కొక్కరు వస్తున్నారు. ఇక అందరిలాగే ఎలాంటి అంచనాలు లేకుండా చివర్లో బిగ్ బాస్ కు నామినేట్ అయ్యి అందరిని ఆశ్చర్యానికి గురిచేసిన వ్యక్తి షానీ సాల్ మన్. తాజాగా బిగ్ బాస్ 6 హౌజ్ లోకి అండర్ డాగ్ గా అడుగుపెట్టాడు. ఇక అతడి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
షానీ సాల్ మన్.. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి. చిన్నప్పటి నుంచి ఇతడికి ఆటలు అంటే ఇష్టం దాంతో ఆటల్లో ఎప్పుడూ ముందుండేవాడు. ఇతడు తన డిగ్రీని ఉస్మానియా యూనివర్సిటిలో చేశాడు. పీజీని నిజాం కాలేజ్ లో పూర్తి చేశాడు. ఇతడిని స్నేహితులు ముద్దుగా బ్లాక్ స్టార్ అని పిలుచుకుంటారు. అది సాల్ మ న్ కు కూడా ఇష్టమే. షానీ అథ్లెటిక్స్ అండ్ జిమ్నాస్టిక్స్ లో నేషనల్ ఛాంపియన్. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక తన సినీ ప్రస్థానాన్ని ఓ సందర్భంలో వివరించాడు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఓ ప్రకటన చూసి దరఖాస్తు చేశాను. తీరా అక్కడికి వెళ్లి చూస్తే అది రాజమౌళిగారు తీసే సై సినిమా అని తెలిసింది.
స్వతహాగా నేను అథ్లెట్ కావడంతో, నా స్టైల్ చూసి రాజమౌళిగారు నాకు అవకాశం ఇచ్చారు. సై మూవీ ద్వారా నాకు మంచి పేరు వచ్చింది. షానీ తన కెరీర్ లో ఇప్పటి వరకు దాదాపు 70 సినిమాల్లో నటించాడు. సైరా మూవీలో కూడా ఇతడు నటించాడు. ఇటీవల వచ్చిన రామ్ అసుర్ మూవీలో ఇతడి నటనకు ప్రశంసలు లభించాయి. అదీ కాక ఫ్రెండ్స్ తో కలిసి ఓవర్-7 అనే ప్రొడక్షన్ ను ప్రారంభించాడు. దీని ద్వార టాలెంట్ ఉన్న కళాకారులను వెలుగులోకి తేవడమే తన ఉద్దేశమంటాడు. పేద, వృద్ద కళాకారులను ఆదుకోవాలన్నది తన లక్ష్యంగా పలు సార్లు చెప్పాడు. బాలీవుడ్ లో వెల్ కం సజ్జన్ పూర్ అనే చిత్రంలో కూడా షానీ నటించాడు. ఇన్ని చిత్రాల్లో నటించిన షానీ సాల్ మన్ కు మాత్రం అనుకున్నంత పేరు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. సమాజం శ్రేయస్సు కోరుకునే వ్యక్తిగా హౌజ్ లోకి అడుగు పెట్టిన సాల్ మన్ ను అభిమానులు ఎంత వరకు అంగీకరిస్తారో మరి కొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేం. మరి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న షానీ సాల్ మన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.