బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఎన్ని తిప్పలు పడినా కూడా ప్రేక్షకుల నాడి పట్టుకోలేకపోతోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ మీద కాస్త ఎక్కువే నెగెటివ్ టాక్ వినబడుతోంది. సీపీఐ నారాయణలాంటి వారు చెప్పిన మాటలను కోట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. “బిగ్ బాస్ అంటే బ్రోతల్ హౌస్” అంటూ నారాయణ చేసిన వ్యాఖ్యలను చాలా మంది సమర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. ఊరికే ప్రేక్షకులను, నెటిజన్స్ ని ఆడిపోసుకోవడం కూడా కరెక్ట్ కాదులెండి. ఎందుకంటే రానురాను ఈ బిగ్ బాస్ షోలో జరుగుతున్న ఘటనలు కూడా బయట జరుగుతున్న నెగిటివ్ కామెంట్స్ కు ఆజ్యం పోస్తున్నట్లు పొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వాళ్లు అనడం, వీళ్లు చేయడం రెండూ సరిపోతున్నాయి.
విషయం ఏంటంటే.. బిగ్ బాస్ అంటేనే బూతని, అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలను పెట్టి ఆటలు ఆడిస్తారంటూ చాలా మంది మండిపడుతూ ఉంటారు. తాజాగా హౌస్‌లో ఓ కెప్టెన్సీ పోటీదారుల టాస్కు జరుగుతోంది. అదే.. హోటల్ వర్సెస్ హోటల్. అంటే ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి బీబీ హోటల్, హోటల్ గ్లామ్ ప్యారడైజ్ అంటూ పేర్లు పెట్టారు. ఈ గ్లామ్ ప్యారడైజ్‌లో శ్రీ సత్య, ఫైమా, కీర్తీ, వాసంతి, ఆరోహిలను పెట్టి వారికి పొట్టి పొట్టి బట్టలు వేసి ఆట ఆడాలంటూ చెప్పుకొచ్చారు. మిగిలిన వారిలో కొందరిని బీబీ హోటల్ స్టాఫ్ గా పెట్టారు. ఈ టాస్కులో గెలిచేందుకు అమ్మాయిలు థాయ్ మసాజ్, హెడ్ మసాజ్, ఆయిల్ మసాజ్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. సూర్యా అయితే చొక్కా తీసేసి ఆరోహీతో ఆయిల్ మసాజ్ చేయించుకున్నాడు.
ఇంక ఇంకో ఘోరం ఏంటంటే.. మెరీనా- రోహిత్ జంటను ఈసారి విడివిడిగా ఆడాలంటూ ఆదేశించారు. రోహిత్ తప్పిపోయిన భార్యను వెతుక్కునే భర్త పాత్ర చేస్తున్నాడు. మెరీనా అసిస్టెంట్ షెఫ్‌గా నటిస్తోంది. వీళ్లకు ఇచ్చిన టాస్కులో గెలవాలంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అంటే ఎక్కువ మంది అతిథులను ఆకట్టుకోవాలి. అందుకు గీతూ రాయల్ వచ్చి రోహిత్‌ని కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. మీ భార్యను వెతికే బాధ్యత మాది అని చెబుతుంది. వెంటనే మెరీనాని చూపిస్తూ.. సార్ మా మెరీనా భర్తతో విడిపోయింది. మీ భార్య లేకపోతే మీరు మా మెరీనాతో కలిసుండొచ్చు. ఒకసారి చేయి పట్టుకోండి సార్ అంటూ చేతులు కలుపుతుంది. ఆమె చేయి పట్టుకుని రోహిత్ కూడా ఏదో కనెక్షన్ ఉంది అనుకుంట.. కొంచం ఫీచర్స్ కూడా నా వైఫ్ లాగానే ఉంది అంటూ రోహిత్ కూడా మాట్లాడతాడు.
అది మొత్తం స్కిట్ అనే అనుకుందాం. వాళ్లు కేవలం ఎటర్‌టైన్మెంట్ కోసమే అలా చేశారు అనే అనుకుందాం. కానీ, భార్య తప్పిపోయిన భర్తకు ఇంకో మహిళను చూపించి మీ ఇద్దరూ కలిసిపోవచ్చు అని చెప్పడం ఎంత వరకు కరెక్ట్? హౌస్ లో ఉండే సభ్యులు ఏదో టాస్క్ హడావుడిలో మాట్లాడితే దానిని ఎడిట్‌చేసే బాధ్యత లేదా? మరోవైపు హౌస్‌లో టాస్కుని అడ్డుపెట్టుకుని అర్జున్ కల్యాణ్ శ్రీ సత్యతో గోరు ముద్దలు పెట్టించుకోవడం, రాజ్ కీర్తీని తినిపించమని అడగటం ఇవన్నీ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చేస్తున్నారు? అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇద్దరి మధ్య కనెక్షన్ లేకపోయినా కూడా సంథింగ్ సంథింగ్ అంటూ ఫొటోలు చూపించడం, మ్యూజిక్‌లు వేయడం, మీ మధ్య ఏదో ఉందని ప్రేక్షకుల మీద పెట్టి రుద్దడం ఎంత వరకు కరెక్ట్? ఇలాంటి ఘటనలు చూసే ప్రేక్షకులు సైతం సీపీఐ నారాయణ తిట్టడంలో ఎలాంటి తప్పులేదంటూ కామెంట్ చేస్తున్నారు. రేటింగ్, వ్యూవర్షిప్ కోసం ఇంతలా దిగజారిపోవాలా? అంటూ అటు హౌస్‌మేట్స్ ని ఇటు నిర్వాహకులపై సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ నెగెటివిటీని ప్రోత్సహిస్తోందని విమర్శిస్తున్నారు.