బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. తొలిరోజు నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూనే పోతోంది. ఇటీవల జరిగిన క్లాస్- మాస్- ట్రాష్ టాస్క్ కానివ్వండి, తాజాగా జరిగిన నామినేషన్స్ కానివ్వండి. అంతా ఒకరేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. మొదటి నుంచి ఈ సీజన్ చాలా కొత్తగా ఉండబోతోందని వచ్చిన మాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ సీజన్ నడుస్తోంది. ప్రతి విషయంలో కంటెస్టెంట్స్ మధ్య ఘర్షణ వాతావరణం కనిపిస్తూనే ఉంది. నిన్నటి వరకు అంతా పైపైన చూపించిన ప్రేమలు, మొహమాటాలు అన్నీ నామినేషన్స్ నుంచి మాయమైపోయాయి. ఎందుకంటే నామినేషన్స్ లో అంతా తమ లోపల ఉన్న మాటలను బయటకు చెప్పారు. ఇక నుంచి అసలైన ఆట మొదలు కానుంది. తొలి నామినేషన్స్ లోనే బిగ్ బాస్ మంచి ట్విస్టులు ఇచ్చాడు.
తొలివారం నామినేషన్స్ లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. రేవంత్, చంటి, ఆరోహి, ఫైమా, అభినయశ్రీ, శ్రీ సత్య, ఇనయా సుల్తానా తొలివారం నామినేషన్స్ లో ఉన్నారు. మొదట అభినయశ్రీ, ఇనయా, బాలాదిత్య నామినేషన్స్ లో ఉండగా.. ఆ తర్వాత క్లాస్ సెక్షన్ వారికి ఒక విశేష అధికారం ఇచ్చి మాస్ గ్రూప్ నుంచి ఒకరిని స్వామ్ చేయమన్నారు. క్లాస్ వాళ్లంతా కలిసి ఆదిత్యాని సేవ్ చేసి ఆరోహీని నామినేషన్స్ లోకి పంపారు. దీంతో మొదటి వారంలోనే ఏడుగురు సభ్యులతో నామినేషన్స్ లిస్ట్ పెద్దగానే మారింది. ఇలా స్వాపింగ్, డైరెక్ట్ నామినేషన్స్ అంటూ ఇచ్చిన ట్విస్టులతో ఇంట్లోని సభ్యులే కాదు.. ప్రేక్షకులు సైతం కంగు తిన్నారు.
ఇంక నామినేషన్స్ లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు, పెదవి విరుపులు అబ్బో ఒకటి కాదు రెండు కాదు. అయితే ఈ మొత్తంలో మరీనా- రోహిత్ పార్ట్ కొంత ఆశ్చర్యాన్ని కొంత అయోమయాన్ని కలిగించాయి. “ఇది ఆరోహికి చెబుతున్నాను. ఇలాంటి చిన్న వాటికి నామినేట్ చేయాలి అనుకోవడం లేదు. నేను కిచెన్‌లో ఉండగా నాకు వినిపించింది. ఆరోహి అంటోంది.. నేను తనకంటే సైజ్ పెద్ద అని. నాకు ఆ మాటలు వినిపించాయి. నాకు నా బాడీతో ఎలాంటి ఇబ్బంది లేదు. మా వారికి కూడా నా బాడీతో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను ఎందుకు వెయిట్ పెరిగానో నాకు తెలుసు. ఎవరూ నాకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నా బాడీ గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు” అంటూ మరీనా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.
ఆమె వ్యాఖ్యలను ఆరోహీ గట్టిగానే ఖండించింది. నువ్వు చాలా పెద్ద ఎలిగేషన్ చేస్తున్నావు. నేను అసలు అనలేదు అంటూ ఆరోహి చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు ఒకవేళ నాది తప్పు అయి ఉంటే నేనే సారీ చెప్తానంటూ మరీనా చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఆమె అన్నదో లేదో? ఈమె ఏమి విన్నదో కూడా క్లారిటీ లేదు. ఆమె 100 శాతం వినుంటే గట్టిగా చెప్పేది. చివర్లో సారీ చెప్తానంటూ అనడం అందరినీ అయోమయానికి గురిచేసింది. నామినేషన్ తర్వాత ఆరోహీ- మరీనా కూర్చొని మాట్లాడుకొని విషయాన్ని క్లియర్ చేసుకుంది. నిజానికి అలాంటి వ్యాఖ్యలు ఆరోహి చేయలేదని మరీనా కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. ఆమె సారీ చెప్పి విషయాన్ని త్వరగానే క్లియర్ చేసుకుంది. అయితే వీకెండ్‌లో నాగార్జున ఏమైనా ఈ విషయంపై కూపీ లాగుతారేమో చూడాలి. మరీనా- ఆరోహీ ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.