బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఎంతో ఉత్కంఠగా సాగుతోంది. తొలిరోజు నుంటే గ్రూపులు, గొడవలు, విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. తొలి నామినేషన్ ప్రక్రియతో ఈ విమర్శలు, గొడవలు అనేవి ఇంకాస్త ఊపందుకున్నాయి. ఏ చిన్న మాట జారినా, ఎవరు కాస్త హర్ట్ అయినా నామినేషన్‌లో చెప్పేస్తారనే విషయం ఈ సీజన్‌తోనూ రుజువైంది. ఈ సీజన్ అన్నింటికి భిన్నంగా ఉండనుందనే టాక్ మొదటే వచ్చింది. అందుకు తగ్గట్లుగానే హౌస్‌లో టాస్కులు కూడా నడుస్తున్నాయి. ఈసారి సీజన్లోనూ ఒక రియల్ కపుల్ ఉన్న విషయం తెలిసిందే. అయితే గతంలో కాకుండా ఈసారి వారి విషయంలో బిగ్ బాస్ కొత్త రూల్ పెట్టారు. వారిలో ఎవరు ఎలిమినేట్ అయినా ఇద్దరూ వెళ్లిపోవాలి. ఇలాంటివి మున్ముందు ఇంకా చాలా వస్తాయంటున్నారు.
అయితే గొడవలు మాత్రం మొదటిరోజు నుంచీ జరుగుతూనే ఉన్నాయి. గీతూ రాయల్ హౌస్‌లో మొదటి గొడవను ప్రారంభించింది. ఆ తర్వాత ఆ గొడవ చాలా దూరం వెళ్లింది. ఆమె సదరు సభ్యురాలు ఇనయా సుల్తానాపై ఆ తర్వాత స్పెషల్ పవర్‌తో పగ కూడా తీర్చుకుంది. అయితే గీతూ రాయల్ అందరినీ చూస్తూ బయట రివ్యూ చేసినట్లు ఇంట్లోకూడా చేస్తోందని అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి విషయంలో ఓ మాట అనేసింది. అయితే చంటి మాత్రం ఆమె మాటను అంత తేలిగ్గా తీసుకోలేదు. ఆమెకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. గీతూ రాయల్‌కి గట్టిగానే సమాధానం చెప్పాడు. ఎంతమంది ఆపినా చంటి మాత్రం తాను అనుకున్న విషయాన్ని చెప్పేశాడు. అంతేకాకుండా తానేంటో తనకు తెలుసంటూ క్లారిటీ కూడా ఇచ్చాడు.
హౌస్‌లో చలాకీ చంటి ఏ పని చేయడంలేదంటూ అందరూ అంటూనే ఉన్నారు. అయితే అందుకు చంటి పలుసార్లు క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఏది చేయాలో ముందే అనుకున్నారు. మళ్లీ నన్ను ఎందుకు అంటున్నారంటూ చంటి ఫైర్ అయ్యాడు. గీతూ తనని నువ్వు వాళ్లని అడగచ్చు కదా అన్న మాటకు చంటి బాగా హర్ట్ అయ్యాడు. అదే విషయాన్ని లివింగ్ ఏరియాలో గీతూ రాయల్‌కు అర్థమయ్యేలా కాస్త గట్టిగానే చెప్పాడు. ఏదైనా నువ్వు విన్నవి, నువ్వు చూసినవి ఉంటేనే మాట్లాడు.. సగం సగం తెలుసుకుని మాట్లాడకంటూ చెప్పుకొచ్చాడు. ఇంట్లో ఉన్న అందరిలో వయసులో తానే పెద్దని.. ఎలా ఉండాలో తనకి తెలుసంటూ క్లారిటీ ఇచ్చాడు.
నామినేషన్స్ లోనూ తనని పని చేయట్లేదు అంటున్న అందరికీ నవ్వుతూనే చంటి చురకలు అంటించాడు. వర్క్ షేర్ చేసే సమయంలో అందరి కంటే ముందు తానే బాత్ రూమ్ క్లీనింగ్ తీసుకున్నాని గుర్తు చేశాడు. “కూరలు కట్ చేసే వాళ్లు వంట చేస్తున్నారు. వంట చేసే వాళ్లు కూరలు కట్ చేస్తున్నారు. వాళ్ల పని వీళ్లు వీళ్ల పని వాళ్లు చేస్తున్నారు. కానీ, ఎవరూ బాత్ రూమ్ క్లీనింగ్ రారు. కానీ, నన్ను మాత్రం ఆ పనులు చేయడం లేదంటూ మాట్లాడుతున్నారు. నాకు అప్పజెప్పిన పని నేను చేస్తున్నాను కదా?” అంటూ చంటి అందరినీ ప్రశ్నించాడు. అంతేకాకుండా గుంపు అంతా కూర్చుని పనులు కూడా 10 నిమిషాల్లో అయ్యే వాటిని గంట చేస్తున్నారంటూ కౌంటర్ కూడా వేశాడు. చలాకీ చంటి- గీతూ రాయల్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.