”బిగ్ బాస్” బుల్లితెర షో అయినప్పటికీ దీని క్రేజ్ మాత్రం మాములుగా ఉండదు. అంతలా ఈ షో సగటు టీవీ అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈ షోకి వచ్చిన వారిలో చాలా మంది కనుమరుగు అయ్యారనే అపవాదు కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ షోకి రావాలని కొంత మంది నటీ, నటుల కోరిక అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాజాగా బిగ్ బాస్ 6 ఆదివారం ప్రారంభం అయ్యింది. ఇక ఇప్పుడు ఈ హౌజ్ లోకి ఐదో సభ్యుడిగా అడుగుపెట్టిన ఒక వ్యక్తి గురించి మాత్రం తీవ్రంగా చర్చ నడుస్తోంది. అతడు ఎవరో మీ అందరికి తెలుసు. తన వాక్చాతుర్యంతో, తన డైలగ్ డెలివరీతో, తన యాసతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక కమెడీయన్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. అతడే వినయ్ మోహన్.. అలియాస్ చలాకీ చంటి.
మనందరికి జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయ్యాడు కానీ అంతకు ముందే ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాడు. “నీ పిండా కూడు” అనే డైలాగ్ తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. తనదైన డైలాగ్ డెలివరీతో ఎవరికీ లేని టాలెంట్ ను సొంతం చేసుకున్నాడు. అతడి వాయిసే అతడికి బలం. ఇక అతడి బయోగ్రఫీలోకి వెళితే.. చలాకీ చంటి పుట్టి పెరిగింది హైద్రాబాద్ లోనే చదువులో అంత పెద్ద తోపును కాదు అని పలు సందర్భాల్లో తెలిపాడు. అందుకే 10th సప్లిమెంటరీలో పాస్ అయ్యాడని తెలిపాడు. చంటికి చిన్నప్పటి నుంచి కళలపై మక్కువ ఉండేది. దాంతో పలు మిమిక్రి షోలు చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే టాటా ఇండికామ్ లో, ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లో మేనేజర్ ఇలా పొట్టకూటి కోసం రకరకాల ఉద్యోగాలు చేశాడు.
రేడియో జాకీ(RJ)గా మారిన తర్వాతే తన పేరును చలాకీ చంటిగా మార్చుకున్నాడు. అప్పుడే చంటీ-బంటీ అనే షో చేసి పేరు గడించాడు. తర్వాత జబర్దస్త్ షో చంటి తలరాతనే మార్చింది. జబర్దస్త్ తర్వాత అతడికి వరుసగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. చంటి తన పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందని చెబుతాడు. తన స్కీట్ చూసి ఒకమ్మాయి నేనంటే ఇష్టం అని, పెళ్లి చేసుకుంటే నన్నే చేసుకుంటానని వాల్లింట్లో చెప్పింది. అదే విషయాన్ని మా ఇంటికి ఫోన్ చేసి చెప్పింది. దాంతో మా ఇద్దరి వివాహం జరిగింది అని చెప్పాడు. ఇక భీమిలీ కబడ్డి జట్టు మూవీ చంటికి మంచి పేరు తెచ్చింది.
అయితే చంటి టైమ్ కి షూటింగ్ కు రాడని పరిశ్రమలో పుకార్లు సృష్టించారని చాలా సందర్భాల్లో వాపోయాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు బిగ్ బాస్ 6 హౌజ్ లోకి అడుగు పెట్టాడు. మరి ముక్కు సూటిగా మాట్లాడతాడు అనే పేరున్న చంటీ ఎంతమేరకు హౌజ్ లో రాణించగలడో చూడాలి. గత సీజన్ లో జబర్దస్త్ కమెడీయన్ ముక్కు అవినాష్ చాలా అద్భుతంగా రాణించిన విషయం మనందరికి తెలిసిందే. అలాగే చంటీ కూడా రాణించాలని ఆ టీం మెుత్తం కోరుకుంటుంది. మరి తనదైన యాసతో, టైమింగ్ తో, ముక్కుసూటి తనంతో ఎంత మేరకు ఈ చలాకీ బాయ్ లాక్కోస్తాడో వేచి చూడాలి. చలాకీ చంటి బిగ్ బాస్6 కు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.