బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. దాదాపుగా ఆఖరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్‌లో టికెట్ టూ ఫినాలే కోసం పోరాటం జరుగుతోంది. అంటే ఈ టాస్కుల్లో విజయం సాధించి టికెట్ టూ ఫినాలో సొంతం చేసుకుంటే వారు నేరుగా ఫైనల్ వీక్ వెళ్లిపోయినట్లే అంటే టాప్ 5 పక్కా అనమాట. ఇప్పుడు అందుకోసం హౌస్‌లో చాలానే టాస్కులు నిర్వహిస్తున్నారు. అయితే మొదటి టాస్కులో విజయం సాధించి కామన్ మ్యాన్ ఆదిరెడ్డి మొదటి ఫైనలిస్ట్ గా మారినట్లు లీకులు వస్తున్నాయి. అన్ని టాస్కుల్లో గట్టి పోటీ ఇచ్చిన రేవంత్‌ని కూడా దాటేసుకుని ఆదిరెడ్డి మొదటి ఫైనలిస్ట్ అవ్వడంతో అతని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆదిరెడ్డి కెప్టెన్ అయినప్పుడు ఎంత ఎమోషనల్ అయ్యాడో చూశాం. ఆ సమయంలో కామన్ మ్యాన్ రివ్యూయర్ అయ్యాడు, రివ్యూయర్ కంటెస్టెంట్ అయ్యాడు, కంటెస్టెంట్ కెప్టెన్ అయ్యాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కామన్ మ్యాన్ నుంచి ఆదిరెడ్డి అలియాస్ ఉడాల్ మామ బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 తొలి ఫైనలిస్ట్ అయ్యి రికార్డు సృష్టించాడు. ఈసారి కూడా ఆదిరెడ్డి బాగా ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్, ఫైమా ఈ టాస్కులో పోటీ పడగా ఉడాల్ మామ విజయం సాధించినట్లు చెబుతున్నారు. ఈ దెబ్బతో కామన్ మ్యాన్ విన్నర్ కూడా అవుతాడు అంటూ ఆదిరెడ్డి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే ఆదిరెడ్డి జర్నీని కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కామన్ మ్యాన్‌గా తన ప్రయాణం మొదలు పెట్టి ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 మొదటి ఫైనలిస్టు కావడం అనేది చిన్న విషయం కాదు. అయితే ఇక్కడ ఇంకో అగ్నిపరీక్ష మిగిలే ఉంది. అదేంటంటే.. టికెట్ టూ ఫినాలే సొంతం చేసుకున్నంత మాత్రాన ఆదిరెడ్డి ఫైనల్ చేరాడు అనుకోవడానికి లేదు. అవును ఆదిరెడ్డి ఈవారం నామినేషన్స్ లో ఉన్నాడు. కాబట్టి ఆ నామినేషన్స్ నుంచి సేవ్ అయితేనే ఆదిరెడ్డి ఫైనలిస్ట్ అవుతాడు. గతవారం సేవ్ అయిన ఆదిరెడ్డి ఆఖరి వరకు వచ్చాడు. లాస్ట్ నుంచి మూడో వ్యక్తిగా సేవ్ అయ్యాడు. ఫైమా ఎలిమినేట్ కావాల్సింది ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయ్యింది. రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. అంటే ఇంక ఫైమా, ఆదిరెడ్డి డేంజర్ జోన్లో ఉన్నట్లనే అర్థం. ఈ వారం ఓటింగ్ ఏ మాత్రం తారుమారు అయినా ఆదిరెడ్డికి గండం తప్పదు. కాబట్టి కామన్ మ్యాన్ బిగ్ బాస్ తొలి ఫైనలిస్ట్ కావాలి అంటే ఈ వారం సేవ్ కావాలి.