బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మూడోవారంలోకి అడుగుపెట్టింది. సోమవారం నామినేషన్స్ లో జరిగిన రచ్చ తర్వాత హౌస్‌లో ఆట మారిందని అందరికీ తెలిసిపోయింది. మంగళవారం అనగానే హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల టాస్కు ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే ఈసారి బిగ్ బాస్ ‘అడవిలో ఆట’ అనే టాస్క్ ఇచ్చాడు. ప్రతి సీజన్లో ఉండే మాదిరిగానే ఈ సీజన్లోనూ ఇంట్లోని సభ్యులను రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూపులో పోలీసులు, రెండో గ్రూపులు దొంగలు ఉంటారు. గీతూ రాయల్ మాత్రం స్వార్థపరురాలైన వ్యాపారస్థురాలిగా వ్యవహరిస్తోంది. ఈ టాస్కులో ఎవరికి వారు రెచ్చిపోయి ఆడుతున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో 16వ రోజు, ఎపిసోడ్ 17లో అసలు ఏం జరిగిందో చూద్దాం.
ముందురోజు నామినేషన్లలో జరిగిన అంశాలు, ఎవరు ఎవరిని నామినేట్ చేశారు, ఆ సమయంలో వాళ్లు చెప్పిన మాటలు వాస్తవమేనా? అనే అంశాలను పొద్దున్నే నిద్ర లేవగానే చర్చకు తీసుకొచ్చారు. ఇద్దరిద్దరు, ముగ్గురు నలుగు కూర్చొని వాళ్లు నన్ను ఆ మాట అని ఎలా నామినేట్ చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేయడం చూశాం. ముఖ్యంగా నేహా చౌదరి తనను అంత మాట అంటాడా అంటూ రేవంత్ విషయంలో ఏడ్చేసింది. ఆమెను చంటి, బాలాదిత్య ఓదార్చుతూ కనిపించారు. చంటి అయితే రేవంత్ విషయంలో బాగానే నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యాడు. ఏ విషయాన్ని తాను వదిలిపెట్టనని తప్పకుండా అప్పజెప్తానంటూ చెప్పాడు. అయితే చంటి- రేవంత్ విషయంలో చాలా రోజులుగా పరోక్షంగా యుద్ధం జరుగుతోందని మరోసారి రుజువైంది. అయితే వాళ్లిద్దరి మధ్య అంత ఎందుకు చెడింది అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
శ్రీ సత్య ఆటలో జోరు పెంచేసిందనే చెప్పాలి. రెండోవారం నువ్వు అస్సలు ఆడలేదు అంటూ నాగార్జున నిల్చోబెట్టి కడిగేశాడు. ఆ తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు కనిపించింది. సోఫా నుంచి లేచి గేమ్‌లో అడుగుపెట్టింది. ఆమెను వరస్ట్ హౌస్‌మేట్ అంటూ జైల్లో పెట్టిన సందర్భంలో కేవలం డబ్బు కోసమే వచ్చానంటూ చెప్పుకొచ్చింది. మరోసారి రేవంత్‌తో మాట్లాడుతూ నేను కేవలం డబ్బు- ఫేమ్ కోసమే వచ్చాను. నేను ఇంట్లో వారితో నా అనుబంధం సున్నాకి సున్నానే ఉంటుంది. నా నుంచి ఏమీ ఎక్సెపెక్ట్ చేయకండి. నేను అలాంటి కంటెంట్ ఇవ్వలేను” అంటూ క్లారిటీ ఇచ్చేసింది. గేమ్ విషయానికి వస్తే గీతూని కడిగేసింది. నీకు రూల్స్, రూల్ బుక్ ఏం ఉండదుగా అంటూ కౌంటర్ వేసింది. అలా రూల్స్ పాటించకుండా ఆడినందుకేగా నీకు నాగార్జున గారు చప్పట్లు కొట్టారంటూ నాగ్‌కి కూడా చురకలు అంటించింది.
ఈ అడవిలో ఆటలో భాగంగా రూల్స్ పాటించే ఉద్దేశం ఎవరిలోను కనిపించడం లేదు. అంతా డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఆరోహీ రావు అయితే పోలీసుగా ఉన్న ఫైమాతో ఒప్పందం చేసుకుంది. నేను వచ్చినప్పుడు నన్ను లైట్‌గా తీసుకుంటే ఇంట్లో వాళ్లు బొమ్మలు ఎక్కడ దాచుకున్నారో నేను మీకు హింట్ ఇస్తానంటూ ఫైమాతో డీల్ కుదుర్చుకుంది. తనని వదిలేయడం, తన బొమ్మలను పట్టుకోకుండా ఉండాలంటూ డిమాండ్ చేసింది. అందుకు ఫైమా కూడా ఓకే చెప్పింది. మరోవైపు రేవంత్ కూడా తన గేమ్ స్టార్ట్ చేశాడు. గీతూతో సీక్రెట్ డీల్ చేసుకున్నట్లుగా కనిపించాడు. అంతేకాకుండా బొమ్మలకు రెడ్ ట్యాగ్ ఉండాలని చెప్పగా రెడ్ టవర్ నుంచి దారాలు లాగి వాటిని బొమ్మలకు చుట్టి గీతూకి అమ్మేస్తున్నాడు. నిజానికి రేవంత్ సమస్ఫూర్తిగా కచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అలాంటి ఆలోచన రావడం గ్రేట్. చాలా బొమ్మలకు రెడ్ ట్యాగ్‌లు లేవు. కానీ, వీళ్లు రెడ్ ట్యాగ్ ఉన్నవి మాత్రమే అమ్మాలి. అలా చూస్తే రేవంత్ చాలా బాగా ప్లాన్ చేశాడు.
ఈ టాస్కు మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇంట్లోని సభ్యులకు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొదటి నేహా చౌదరికి దెబ్బ తగిలింది. ఆమె బొమ్మలను తీసుకునేందుకు అడవిలోకి వెళ్లగా.. ఆమెను బాలాదిత్య కాలు పట్టుకుని లాక్ చేశాడు. ఆమె వదిలిపెట్టమని ఎంత అరిచినా బాలాదిత్య వదలలేదు. ఆమె విడిపించుకునేందుకు ఫైట్ చేసి వెనక్కి పడి తలకు దెబ్బ తగలించుకుంది. ఆ విషయంలో బాలాదిత్యను తప్పుబట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే దొంగలను అడ్డుకోవాలని బిగ్ బాస్ చెప్పాడు. కాబట్టి బాలాదిత్య ఆ పని చేశాడు. ఇంక ఆరోహీ రావుకి కూడా దెబ్బ తగిలింది. శ్రీహాన్.. ఆమెను సేవ్ చేయాలని ప్రయత్నిస్తూ చేయి పట్టుకుని లాగుతాడు. అప్పుడు ఆమె కాలికి గతంలో ఉన్న దెబ్బ మళ్లీ బయటపడింది.
ఆరోహీ రావుకు దెబ్బ తగిలిందని ఆమెను లోపలికి తీసుకెళ్లారు. అప్పుడు ఇనయా అంతా దొంగ నాటకాలు అంటూ కామెంట్ చేస్తుంది. అంతేకాకుండా శ్రీహాన్ లాగితేనే ఆమెకు దెబ్బ తగిలిందని చెప్పేందుకు గట్టిగానే ప్రయత్నించింది. కాకపోతే ఆమె వాడు వాడు అంటూ శ్రీహాన్ విషయంలో నోరు జారింది. అందుకు శ్రీహాన్ కూడా రెచ్చిపోయాడు. నోరు అదుపులో పెట్టుకో అంటూ కేకలు వేశాడు. అయితే వీళ్ల మధ్యలోకి రేవంత్ వచ్చేసరికి గొడవ మరింత పెరిగింది. దాంతో మాటలేంటి అంటూ రేవంత్ నోరు జారాడు. అంతేకాకుండా కొట్టేస్తారనంటూ మీదకు కూడా వెళ్లాడు. అంతే ఇంక నానా బీభత్సం జరిగింది. అయితే ఇనయా వాడు అని నోరు జారడం తప్పేగానీ, అమ్మాయిని కొట్టేస్తానంటూ ఇంతమంది చూసే రియాలిటీ షోలో రేవంత్ దూసుకెళ్లడం తప్పనే చెప్పాలి. సంస్కారం గురించి మాట్లాడిన రేవంత్ ఆ సంస్కారాన్ని ప్రదర్శించలేదనే చెప్పాలి. ఆ సంఘనటలో మాత్రం రేవంత్ ఇమేజ్ డామేజ్ జరిగింది.
ఈ కెప్టెన్సీ టాస్కులో నియమాలు, రూల్ బుక్‌ని పాటించేవాళ్లు ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే గత టాస్కులో రూల్స్ ని పక్కనపెట్టి ఆడిన గీతూని గ్రేట్ అన్న విషయం అందరి మైండ్‌లో ఉన్నట్లుగా ఉంది. దొంగలు, పోలీసులు, ముఖ్యంగా గీతూ ఎవరూ రూల్స్ ని పాటించడం లేదు. దొంగలు వారిలో వాళ్లు మోసాలు చేసుకుంటున్నారు. పోలీసులు మాత్రం వస్తువులు దాచిపెడుతూ, రెడ్ ట్యాగ్ తీసేస్తూ మోసం చేస్తున్నారు. ఇంక గీతూ విషయానికి వస్తే.. ఆమె బొమ్మలు కొనాలి అందుకు ఏ స్ట్రాటజీ అయినా ఉపయోగించొచ్చు. కానీ, ఆమె మాత్రం దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యింది. అలా రెండు బొమ్మలు తీసుకుని దొరికిపోయింది. వాటిని శ్రీహాన్‌కి ఇచ్చి గేమ్ మార్చేసింది. ఇప్పుడు అంతా గీతూ స్టైల్ లోనే రూల్స్ లేకుండా గేమ్ ఆడేందుకు సిద్ధమైపోయారు. ఇంకా రెండ్రోజులు జరిగే ఈ టాస్కులో కావాల్సినన్ని గొడవలు జరగడం ఖాయంగానే ఉంది. అయితే పాటించని కాడికి అసలు రూల్స్ ఎందుకు పెట్టడం? గీతూ విషయంలో బిగ్ బాస్ ఎందుకు అంత ఫేవర్‌గా ఉంటున్నాడు అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమే!.
ఓవరాల్‌గా బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన 16వ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే.. గెలవాలనే కసి అందరిలో కనిపిస్తోంది. అసలు ఆట ఆడనివాళ్లు కూడా స్ట్రాటజీలు ప్లే చేసేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇంకోసారి నాగార్జున నోటి నుంచి వేస్ట్ అనే పదం రాకుండా చూసుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. శ్రీ సత్య, వాసంతి, సుదీపా గేమ్‌లో ఉండేందుకు చాలా కష్టపడుతున్నారు. రేవంత్, గీతూ, శ్రీహాన్ స్ట్రాటజీలు ప్లే చేస్తూ గెలిచేందుకు బాగా ఆడుతున్నారు. ఇనయా విషయానికి వస్తే ఆమె నోటి దురుసు మాత్రం తగ్గడం లేదు. ఈ ఎపిసోడ్‌లో ఆమె టంగ్ స్లిప్ కావడం వల్లే అంత గొడవ జరిగింది. ఆరోహీ రావు గెలుపు కోసం చాలానే ట్రిక్స్ ప్లే చేసింది. కానీ, కాలికి గాయం కారణంగా ఆమె గేమ్ ఆగిపోయింది. కానీ, మాటలతో తన టీమ్ మేట్స్ ని మోటివేట్ చేయడం, మానిప్యూలేట్ చేయడం చూస్తున్నాం. మొత్తానికి ఈ డే 16 ఎపిసోడ్ మాత్రం హౌస్‌లో కారు చిచ్చు రాజేసిందనే చెప్పాలి. ఈ ఎపిసోడ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.