బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. అన్ని సీజన్లతో పోలిస్తే ఈసారి క్రేజ్, రేటింగ్ రెండూ తగ్గిపోయాయి. ఇటీవలే నాగార్జున కూడా ఆ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. కానీ, వ్యూవర్‌షిప్ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ చెబుతున్నారు. ప్రస్తుత సీజన్లో చాలా మంది తెలిసిన ముఖాలు లేకపోవడం, 24 గంటల స్ట్రీమింగ్ వల్ల ప్రేక్షకులకు ఆసక్తి కూడా తగ్గుతోందని చెబుతున్నారు. ప్రస్తుతం హౌస్‌లోని సభ్యులు మాత్రం ఆటలో గెలిచేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఐదో వారం కెప్టెన్‌గా రేవంత్ విన్ అయ్యాడు. గతంలో నేను కెప్టెన్ అయితే అది చేస్తా, ఇది చేస్తా, అందరి లెక్కలు తేలుస్తా అంటూ చాలా కామెంట్స్ చేశాడు. మరి.. వాటిలో ఏది పూర్తి చేస్తాడో చూడాలి. రేవంత్ కెప్టెన్ కావాలని అతని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు.
ఇంక బిగ్ బాస్ ఆట విషయానికి వస్తే.. లగ్జరీ బడ్జెట్ కోసం సభ్యులను రెండు టీమ్లుగా విడదీసి టాస్కు ఇచ్చారు. టగ్ ఆఫ్ వార్ తరహాలో రెండు జట్ల నుంచి ఒక్కొక్కరు చొప్పున వచ్చి పోటీ పడాలి. ఎవరికి కేటాయించిన బాస్కెట్‌లో వాళ్లు వస్తువులను వేయాలి. అలా వేసిన వస్తువులను వాళ్లు గెలుచుకున్నట్లు. ఈ టాస్కులో చంటి టీమ్ విజయం సాధించింది. ఈ సమయంలో చంటి- రేవంత్‌కు మరోసారి గొడవ జరిగింది. నిజానికి రెండో వారం నుంచి హౌస్‌లో రేవంత్- చంటి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అది మళ్లీ ఒకసారి బయటపడింది. రేవంత్ సభ్యులకు రెడీ రెడీ రెడీ అంటూ చెబుతుంటాడు. నిజానికి ఎవరైనా రెడీ అంటే స్టార్ట్ అని అనుకోరు. అదే విషయాన్ని చంటి కూడా లేవనెత్తాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. బాలాదిత్య హౌస్‌లోని సభ్యులపై కేకలు వేశాడు. అదికూడా అలా ఇలా కాదు.. ఉగ్రరూపం దాల్చాడనే చెప్పాలి. ఇంకా ముఖ్యంగా తాను అరిచింది ఎవరిమీదో కాదు.. తన చెల్లి గీతూ రాయల్ మీద. నిజానికి కెప్టెన్సీ టాస్కు విషయంలో బాలాదిత్య కెప్టెన్ రేసులో ఉంటే గీతూ చాలాసేపు ఆటపట్టించింది. చాలా సందర్భాల్లో గీతూ బాలాదిత్యను కామెంట్ చేయడం, ఆటపట్టించడం చేస్తూనే ఉంది. కానీ, బాలాదిత్య మాత్రం అంతగా రియాక్ట్ కాడు. ఇప్పుడు మాత్రం బాలాదిత్య ఉగ్రరూపం దాల్చాడు. నువ్వు నా ఎడ్యుకేషన్‌ని తక్కువ చేస్తున్నావ్, దేనికైనా లిమిట్ ఉంటుంది. నోరు పెద్దగా చేసి అరిస్తే సరిపోదు అంటూ బాలాదిత్య ఫుల్ ఫైర్ అయ్యాడు. అయితే బాలాదిత్య అగ్రెసివ్ అవ్వడాన్ని ఎవరూ తప్పుబట్టడం లేదు. కానీ.. ఇన్నాళ్లు ఎందుకు అంత కూల్‌గా ఉన్నాడు? అలా ఉంటే నడవదు అని గ్రహించి కేకలు వేస్తున్నాడా? అనే అనుమానాలను ప్రేక్షకులు లేవనెత్తుతున్నారు.