బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం ప్రారంభం అయ్యింది. ఇక దాదాపు 3 నెలలకు పైగా ప్రేక్షకులను అలరించనుంది. మొత్తం 19 మంది హౌజ్‌లోకి వెళ్లారు. వీరిలో అరోహి రావు అలియాస్ ఇస్మార్ట్ అంజలి కూడా ఉంది. ఇస్మార్ట్ న్యూస్‌తో అందరికి పరిచయం అయ్యింది అరోహి రావు. గల గల మాట్లాడుతూ.. కామేడీ పంచులు వేస్తూ.. ప్రేక్షకులను అలరించి.. గుర్తింపు తెచ్చకున్న ఈ వరంగల్ పిల్ల బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంతో చలాకీగా నవ్వుతూ.. నవిస్తూ ఉండే అంజలి జీవితంలో అంతులేని విషాదం ఉంది. ఆమె పడిన కష్టాల గురించి తెలిస్తే.. వామ్మో ఎలా భయటపడగలిగింది అనుకుంటారు. ఆ వివరాలు..
అరోహి రావుది వరంగల్. ఆమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. అయితే వీరిద్దరి చిన్నతనంలోనే తల్లి మరణించింది. తండ్రి పిల్లలిద్దరిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుని.. తన దారి తాను చూసుకున్నాడు. ఇక అమ్మమ్మే అరోహి, ఆమె అన్నయ్యను చేరదీసింది. అమ్మమ్మ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. దాంతో ఎన్నో రోజులు తిండి లేక పస్తులున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక తినడానికి తిండికే లేదు.. ఇక చదువు అంటే కష్టమే కదా. దాంతో అరోహి అమ్మమ్మ ఆమెను ప్రభుత్వ పాఠశాలలో చేర్చింది. చదువులో చాలా చురుగ్గా ఉండేది అంజలి. ఆమె ప్రతిభ గుర్తించిన టీచర్లు, చుట్టుపక్కల వాళ్లు ఆమెను చదవించమని ప్రోత్సాహించారు. దాంతో వరంగల్‌లో కాలేజీలో జాయినయ్యింది. తర్వాత ఎంబీఏ చేసింది. ఇక యాంకర్‌గా ఎదగాలని ఆమె కోరిక.
ఆ కలను నిజం చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో చేరింది అరోహి. బతుకుతెరువు కోసం ఉద్యోగాలు చేస్తూనే.. యాంకర్‌గా ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో తొలిసారి స్టూడియో 1లో తనకు యాంకర్‌గా అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించిన అరోహి తన టాలెంట్‌ని మొత్తం ప్రదర్శించింది. అంతా సెట్ అయ్యింది అనుకున్న వేళ్ల.. లాక్‌డౌన్ విధించడంతో ఊరికి వెళ్లిపోయింది. దాంతో వచ్చిన అవకాశం తప్పిపోయింది. అదే సమయంలో తనకు టీవీ9లో అవకాశం వచ్చింది. లాక్‌డౌన్‌లోనే ఇస్మార్ట్ న్యూస్ చదివేందుకు ఆడిషన్ ఇవ్వడం.. సెలక్ట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. టీవీ9లో యాంకర్‌గా పని చేస్తూనే.. కొన్ని షార్ట్ ఫిల్మ్స్‌లలో కూడా నటించింది. ఆ గుర్తింతో ప్రస్తుతం బిగ్‌బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది అరోహి.
ఇక అరోహి జీవితంలో కష్టాలతో పాటు కొన్ని భయంకరమైన సంఘటనలను కూడా చవి చూసింది. బాల్యంలోనే వేధింపులు ఎదర్కొన్నది. అయితే అప్పుడు ఆ సంఘటన గురించి తనకు ఏం తెలియదని.. కానీ పెద్దయ్యాక తాను వేధింపులకు గురయినట్లు అర్థమైందని చెప్పుకొచ్చింది. వీటన్నింటిని దాటుకుని రావడం వల్ల తాను చాలా స్ట్రాంగ్‌గా మారానని.. పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడే తెగువ వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అరోహి. ఇక తన సోదరుడు ప్రస్తుతం మంచి పోజిషన్‌లో సెటిల్ అయ్యాడని.. తాను కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపింది. బిగ్‌బాస్ హౌజ్‌లో తనలానే ఉంటానని చెప్పుకొచ్చింది. అంజలిక అలియాస్ అరోహికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు నెటిజనులు.