బిగ్ బాస్ సీజన్ 5 నాల్గో వారంలోకి ఎంటర్ అయింది. సోమవారం నాడు నామినేషన్ ప్రక్రియ జరగ్గా.. మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. ఈసారి కాస్త గట్టిగానే నామినేషన్ పర్వం కొనసాగింది. నామినేషన్ గొల ముగిసిన తర్వాత ఇక ఎప్పటిలానే మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యులు కలిసిమెలిసి తిరిగారు. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా.. హౌస్ మేట్స్ ను జంటలుగా విడిపోమని చెప్పారు.
ఏ జంటైతే ఎక్కువ బరువుని కోల్పోతారో వాళ్లే ఈ వారం ఈ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్. మధ్య మధ్యలో కొన్ని టాస్క్ లు ఇస్తుంటారు.. అందులో గెలిచిన జంట హాఫ్ కేజీ తగ్గుతుంది. ఓడిపోతే హాఫ్ కేజీ పెరుగుతుంది. ఇది కాకుండా తగ్గడానికి హౌస్ మేట్స్ వేరే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చని చెప్పారు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు అంతా తెగ కష్టపడి వర్క్ ఔట్ చేస్తున్నారు. అయితే ‘బిగ్ బాస్’ ఇచ్చిన టాస్క్‌తో ఇంటి సభ్యులకు ఆహారం విలువ తెలుస్తోంది. ఇంట్లో ఆహారాన్ని మొత్తం తీసుకెళ్లిపోయి.. కేవలం ‘ఫుడ్ బండి’ ద్వారా ఆహారాన్ని పంపిస్తూ.. సభ్యులను టెంప్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఇంట్లో ఆహారం లేకపోవడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఆకలి కేకలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే.. లోబో ఆకలిని తట్టుకోలేక చెత్త బుట్టలో ఆహారం కోసం వెతుక్కోవడం, ఇంటి సభ్యులు అటుగా వస్తున్నారని తెలిసి.. ముఖం కడుకున్నట్లు నటించడం.. యాంకర్ రవి అది చూసి అరే ఏంటిరా అంటూ అడగడం.. చూస్తే గుండె బరువెక్కక మానదు. అయితే అక్కడ సందర్భం ఎలా ఉన్నా.. ప్రోమోలో చూస్తే లోబో పై నిజంగా జాలి వేస్తుందని అంటున్నారు నెటిజన్లు.