నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా ఇప్పటి వరకు 397.3 కిలోమీటర్లు నడిచారు. నిన్న 30వ రోజున 15.8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 31వ రోజు పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోని గాదంకి టోల్‌గేట్ వద్ద ఉన్న విడిది కేంద్ర నుంచి ప్రారంభం అయింది.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. యువనేతకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, సామాన్య జనం పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారు. లోకేష్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ, వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక, యువనేత పాదయాత్ర 31వ రోజుకు చేరుకుంది. బుధవారం నాడు 31వ రోజు పాదయాత్ర చంద్రగిరి నియోజకవర్గంలోని గాదంకి టోల్ గేట్ వద్ద ఉన్న విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. పాదయాత్ర ప్రారంభించడానికి ముందు లోకేష్ సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కోసం వచ్చిన దాదాపు 1000 మందితో సెల్ఫీలు దిగారు. అనంతరం కాపు సామాజిక వర్గం నేతలతో మాటామంతీ నిర్వహించారు.
ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. నేండ్రగుంట వద్ద 400 కి.మీ. పూర్తయిన సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాశీపెంట వద్ద మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ సంపూర్ణ మద్య నిషేదం పెట్టిన తర్వాతే వైఎస్ జగన్ ఓట్లు అడుగుతానన్నాడు. కానీ, కల్తీ మద్యం తయారు చేసి మహిళల తాళి బొట్టు తెంచుతున్నాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతను గంజాయి మత్తులో ముంచుతున్నాడు. జగన్ సర్కార్ మరోసారి కరెంట్ బిల్లులు పెంచే అవకాశం ఉంది. ప్రతీ గడపలో నిరుద్యోగి ఉన్నాడు.
ఆ సమస్య పోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. శాసన సభ సాక్షిగా వైఎస్సార్ సీపీ నేతలు నా తల్లిని అవమానించారు. ఆమె కోలుకోవటానికి ఆరు నెలలు పట్టింది. వైసీపీ వాళ్లు మహిళల జోలికి వస్తే నాకు చెప్పండి. వారి తోలు తీస్తా. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చెప్పుతో కొట్టాలి. నేను అండగా ఉంటా. అధికారంలోకి రాగానే భూకబ్జాలు, అక్రమ దందాలను ఉక్కు పాదంతో అణిచి వేస్తా’’ అని అన్నారు. ఇర్రంగారిపల్లిలో యువతీయువకులతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. వారు తమ సమస్యలను యువనేతకు విన్నవించుకున్నారు. యువనేత వారికి భరోసా ఇచ్చారు.