ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ తన మంత్రి వర్గంలో కొత్తవారికి ఛాన్సు ఇచ్చారు. ఈ క్రమంలో సినీ నటి, నగరి ఎమ్మెల్యేకి ఏపి కెబినెట్ లో చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రిగా బాధ్యతలు రోజాకి అప్పజెప్పారు సీఎం కేసీఆర్. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సారిగా ఆర్కే రోజా తన సొంత నియోజకవర్గం నగరికి వచ్చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు ఆమెకు భారీ స్వాగతం పలికారు.
రేణిగుంట నుంచి నగరి వరకు ఎక్కడ చూసినా జనసందోహం కనిపించింది. తమ నియోజకవర్గానికి వన్నె తెచ్చారని.. ఆమెకు మరింత గొప్ప ఉన్నత పదవులు రావాలని అభిమానులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి నగరి వరకు అడుగడునా ఆమెకు హారతులు పట్టారు. రేణు గుంట విమానాశ్రయం నుంచి నగరి వరకు అన్ని గ్రామాలు, పట్టణాల ప్రజలు మంత్రి రోజాకు బ్రహ్మరథం పట్టారు.
ఇక పుత్తూరు లో మంత్రి రోజా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. భారీ గజమాలతో ఆమెను సత్కరించారు. ఇందుకోసం పెద్ద క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. తన చదువు తిరుపతిలోనే కొనసాగిందని.. ఈ రోజు తిరుపతి జిల్లా నుంచి మంత్రి అవ్వడం సంతోషంగా ఉందన్నారు. నగరి ప్రజల ఆశీస్సుల వల్లే మంత్రి కాగలిగానన్న రోజా… తనపై అభిమానం చూపిన వారికి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.