YSR Cheyutha: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన వైఎస్సార్ చేయూత పథకం రాష్ట్రంలోని పేద మహిళల పాలిట వరంగా మారింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మహిళలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వం అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు అందిస్తోంది. మూడు సంవత్సరాలకు గానూ దాదాపు 56 వేల రూపాయలు వారి అకౌంట్లలోకి నేరుగా బదిలీ చేసింది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా నగదు లబ్ధిపొందిన మహిళలు.. ఆ డబ్బులను తమ ఆర్థిక ఉన్నతికి ఉపయోగిస్తున్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా లబ్ధి పొందిన ఓ మహిళ ఆవులు కొని, వాటి పాలతో వ్యాపారం చేసి సంతోషంగా జీవనం సాగిస్తోంది.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు వైఎస్సార్ చేయూత పథకం కింద ప్రతీ సంవత్సరం రూ.18,750 వచ్చాయి. మూడు సంవత్సరాల డబ్బులు దాచుకున్నాను. ఆ మొత్తం డబ్బులతో రెండు ఆవులను కొన్నాను. వాటిని సాకుతూ ఉన్నాను. ఆ ఆవుల నుంచి ప్రతిరోజూ 10 లీటర్ల పాలు పితికి అమ్ముతున్నాను. పాలు అమ్మటం ద్వారా వచ్చిన డబ్బులతో సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగలుగుతున్నాను. ఈ వయసులో కూడా నా కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ ఆర్థికంగా ఆదుకుంటున్నారు ’’ అని సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ 23వ తేదీన కుప్పంలో వైఎస్సార్ చేయూత మూడో విడుత నగదును విడుదల చేశారు.
అనంతరం ప్రజలను ఉద్ధేశించి ఆయన మాట్లాడుతూ.. జనవరి నుంచి పెన్షన్‌ను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెన్షన్‌ను 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెంచి అందించనున్నట్లు తెలిపారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ ప్రకారం త్వరలో పెన్షన్‌ను 3 వేల రూపాయలు చేస్తామని స్పష్టం చేశారు. వైఎస్సార్ చేయూత పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 26,39,703 మంది అక్క చెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్లు పంపిణీ చేశామని ఆయన వెల్లడించారు. మూడో దఫాతో కలుపుకుని ఒక్క చేయూత కింద రూ. 14,110.62 కోట్లు పంపిణీ చేశామన్నారు.