ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మకు ప్రమాదం తప్పింది. కర్నూలులో ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు విజయమ్మ గురువారం అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరై కర్నూలు నుంచి తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోకి వచ్చే సరికి ఆమె ప్రయాణిస్తున్న కారు టైర్ ఒక్కసారిగా పేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో విజయమ్మకు ఏం కాలేదు. ఆమె సురక్షితంగా బయటపడ్డారు. మరో కారులో విజయమ్మ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడు అయ్యప రెడ్డిని వైఎస్ విజయమ్మ గురువారం పరామర్శించారు. అక్కడ అయ్యపరెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం తిరుగు ప్రయాణంలో గుత్తి పెట్రోల్ బంక్ సమీపంలో విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్ పేలిపోయింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది.
అదుపుతప్పిన కారును డ్రైవర్ అతి కష్టం మీద అదుపు చేశారు. ఈ ప్రమాదం నుంచి విజయమ్మ క్షేమంగా బయటపడ్డారు. వైఎస్ విజయమ్మ సహా కారులో ఉన్న మిగిలినవారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వైఎస్ విజయమ్మకు మరో కారు ఏర్పాటు చేశారు. ఆ కారులో వైఎస్ విజయమ్మ అక్కడి నుండి వెళ్లిపోయారు.