ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు తమ ప్రియతమ నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇక, తన పుట్టిన రోజు సందర్భంగా సీఎం జగన్ ఓ విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా యడ్లపల్లిలో ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీఎం జగన్ తన 50వ పుట్టిన రోజు సందర్భంగా 5,18,740 ట్యాబ్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు.
అంతేకాదు! బోధనకు సాయపడేలా 59,176 టీచర్లకు ఉచిత ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమం సందర్బంగా ముఖ్యమంత్రి ప్రజలను ఉద్ధేశించి మాట్లాడుతూ.. కొందరు పెత్తందారులు తమ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో చదివిస్తారని, పేద పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటే మాత్రం కోర్టులకు వెళ్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. పేద విద్యార్థుకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదని పెత్తందారీ భావజాలం చూస్తోందని మండిపడ్డారు. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలన్నారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించటమే తమ ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు.
తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గం అని అన్నారు. అందరికి సమానమైన నైపుణ్యం ఉండకపోవచ్చు, కానీ అందరికి సమాన అవకాశం దొరకాలని ఆకాంక్షించారు. ట్యాబ్‌లలో తెలుగుతో పాటు 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయని, పిల్లలకు సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్‌లు ఇస్తున్నామని తెలిపారు. పిల్లలకు నష్టం జరిగే కంటెంట్‌ను ట్యాబ్‌లలోంచి తీసేశామని చెప్పారు. విద్యార్థులకు ఇచ్చే ఒక్కో ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్ విలువ 32 వేల రూపాయలు ఉంటుందన్నారు. తన పుట్టిన రోజు నాడు తనకెంతో ఇష్టమైన చిన్నారుల భవిష్యత్తు కోసం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం.. దేవుడు తనకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మరి, సీఎం జగన్ పుట్టిన సందర్భంగా ప్రారంభమైన ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.