YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయంటూ మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు వర్షాకాల సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘‘ కోవిడ్ లాంటి పెను సవాళ్లు వచ్చినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తా ఉన్నాం.
మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను 98.44 శాతం అమలు చేశాం.. ఇంకా చేస్తూ ఉన్నాం. రాష్ట్రం అన్ని రకాలుగా బాగానే ఉన్నా బాగోలేదని, అన్ని రకాలుగా ఇబ్బందుల్లో పడిందని చంద్రబాబు నాయుడు, ఆయన బ్యాచ్ ప్రజల్లో లేని భయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రం మరో శ్రీలంక అయిపోయిందని నమ్మించే ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నారు. రాష్ట్రంలో జీడీపీ పెరుగుదల గతంలో కంటే చాలా బాగుంది. చంద్రబాబు హయాంలో 5.36 ఉన్న జీడీపీ గ్రోత్‌రేట్.. మన పాలనలో 6 .89 శాతానికి పెరిగింది. జీడీపీ గ్రోత్‌రేట్‌లో రాష్ట్రం దేశంలోనే ఆరోస్థానంలో ఉంది. జీడీపీ గ్రోత్‌రేట్‌లో గత మూడేళ్లుగా తొలి మూడు, నాలుగు స్థానాల్లోనే ఉన్నాం.
తాజాగా, 2021-22లో రాష్ట్ర జీడీపీ గ్రోత్‌రేట్ 11.43 శాతంగా ఉంది. చంద్రబాబు హయాంలో దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా 4.45 శాతం. మన పాలనలో అది 5 శాతానికి పెరిగింది. ప్రజల కొనుగోలు శక్తి పడిపోకుండా, వస్తువులకు డిమాండ్ తగ్గకుండా పథకాల ద్వారా పేదల్ని ఆదుకోవటమే రాష్ట్ర పురోగతికి కారణం. 2014లో రాష్ట్రం అప్పు లక్షా 20 వేల కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రం అప్పు 2 లక్షల 69వేల కోట్లు. బాబు హయాంలో అప్పులు ఏకంగా 122.52 శాతం పెరిగాయి. అంటే.. ఏడాదికి 17.45 శాతం చొప్పున అప్పులు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ. 3.82 కోట్లు. మూడేళ్లలో పెరిగిన రాష్ట్రం రుణం 41.83 శాతం.
పాలనలో ఏడాదికి 12. 73 శాతం చొప్పున మాత్రమే అప్పులు పెరిగాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో చేసిన అప్పులు రూ.59 వేల కోట్లకు ఎగబాకాయి. చంద్రబాబు దిగిపోయే నాటికి రాష్ట్రం మొత్తం అప్పులు 3 లక్షల 28 వేల 719 కోట్లకు పెరిగాయి. బాబు హయాంలో ఐదేళ్లలో ఏకంగా 144 శాతం రుణాలు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పులు దాదాపు రూ.5 లక్షల కోట్లు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉంద’’ని అన్నారు. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అసెంబ్లీలో వెల్లడించిన వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : YS Jagan Mohan Reddy: అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ ఒక్కటే మార్గం: సీఎం జగన్